Revanth Reddy: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను గత ప్రభుత్వాలు లీజుకు ఇచ్చాయి: రేవంత్ రెడ్డి ఆగ్రహం

Revanth Reddy Slams Previous Governments for Leasing Sarvai Papanagoud Fort
  • పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
  • బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారన్న సీఎం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్న ముఖ్యమంత్రి
గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ట్యాంక్‌బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పాపన్న విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్నగౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ కుటుంబం ఈ దేశానికి గొప్ప వరమని, శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ నిరూపించారని ఆయన అన్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ పదవులు త్యాగం చేశారని ప్రశంసించారు. భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఆ కుటుంబం గొప్ప నాయకత్వాన్ని అందించిందని వ్యాఖ్యానించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమేనని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేశామని, అందులో తప్పులుంటే చూపాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు శాసనసభ వేదికగా సవాల్ విసిరామని ఆయన గుర్తు చేశారు. తప్పులు చూపితే క్షమాపణ కూడా చెబుతానని చెప్పానన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కులగణనను తప్పుపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. దీనిని తప్పుపడితే బహుజనులకు వందేళ్ల వరకు న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు కలిపితే రిజర్వేషన్లు 70 శాతానికి చేరుకుంటాయని అన్నారు. కానీ గత ప్రభుత్వం తెలంగాణలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా చట్టం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన చట్టమే ఇప్పుడు అడ్డంకిగా మారిందని ఆరోపించారు.
Revanth Reddy
Sardar Sarvai Papanagoud
Khilashapur Fort
Telangana
Mining Lease
BC Reservations

More Telugu News