Naveen Patnaik: నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై వైద్యులు ఏం చెప్పారంటే...!

Naveen Patnaik Health Update Doctors Statement
  • ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు అస్వస్థత
  • భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక
  • డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు
ఒడిశా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, శనివారం రాత్రి నవీన్ పట్నాయక్ కొంత అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి పరీక్షించారు. అయినప్పటికీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో నిన్న మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 

నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. డీహైడ్రేషన్ తో ఆయన బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని, నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నాయి.

గత కొంతకాలంగా వయసు రీత్యా వస్తున్న ఆరోగ్య సమస్యలతో నవీన్ పట్నాయక్ ఇబ్బంది పడుతున్నారు. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన, గత నెలలో ముంబైలో వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ జరిగిన కొద్దికాలానికే ఆయన మళ్లీ అస్వస్థతకు గురికావడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఒడిశాకు వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. 24 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. 
Naveen Patnaik
Naveen Patnaik health
Biju Janata Dal
Odisha politics
Mohan Charan Majhi
Odisha CM
Dehydration
Hospitalized

More Telugu News