Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ ఆసక్తికర పరిణామం... కరాచీ పోర్టు నుంచి పాక్ నౌకలు పరార్!

Pakistan Navy flees Karachi Port during Operation Sindoor
  • ఆపరేషన్ సిందూర్ భయంతో తోక ముడిచిన పాక్ నేవీ
  • కరాచీ నౌకాశ్రయం నుంచి గ్వాదర్ పోర్టుకు నౌకల తరలింపు
  • ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు
  • ఇటీవల చైనా నుంచి కొన్న నౌకలు కూడా తరలింపు
  • 1971 యుద్ధాన్ని గుర్తుకు తెస్తున్న తాజా పరిణామాలు
ఆపరేషన్ సిందూర్ వేళ అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ నౌకలను కాపాడుకునేందుకు పాక్ నేవీ వాటిని కరాచీ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ కీలక విషయం తాజాగా బయటపడిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక సేకరించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, మే 8వ తేదీన కరాచీ నౌకాశ్రయం దాదాపు ఖాళీగా కనిపించింది. అయితే, రెండు రోజుల తర్వాత మే 10న కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్ పోర్టులో ఏకంగా ఏడు పాక్ యుద్ధ నౌకలు నిలిపి ఉంచినట్లు స్పష్టంగా నమోదైంది. మరికొన్ని నౌకలను వాణిజ్య టెర్మినళ్లలో, ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని జలాల్లో దాచిపెట్టినట్లు సమాచారం.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇలా తరలించిన నౌకల్లో పాకిస్థాన్ ఆరు నెలల క్రితమే చైనా నుంచి కొనుగోలు చేసిన నాలుగు శక్తిమంతమైన 'జుల్ఫికర్' శ్రేణి ఫ్రిగేట్లు కూడా ఉన్నాయి. ఈ నౌకలను ప్రారంభించినప్పుడు పాక్ నేవీ యాంటీ-షిప్ మిసైల్స్ ప్రయోగించిన వీడియోలను విడుదల చేసి గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం భారత దాడి భయంతో వాటిని ప్రధాన స్థావరం నుంచి తరలించడం గమనార్హం.

ఈ పరిణామం 1971 నాటి యుద్ధాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో భారత నౌకాదళం 'ఆపరేషన్ పైథాన్' పేరుతో కరాచీ ఓడరేవుపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించింది. ఆ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలు నౌకలు, చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చనే భయంతోనే పాక్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. "దేశ రక్షణ కోసం వీర మరణం పొందడానికైనా సిద్ధం" అని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. మే 10న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగినప్పుడు మునీర్ ఓ రహస్య బంకర్‌లో దాక్కున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Operation Sindoor
Pakistan Navy
Karachi Port
Gwadar Port
Asim Munir
Indian Navy
Zulfiqar Frigates
Pakistan China relations
Naval warfare
Operation Python 1971

More Telugu News