భారత్‌పై సుంకాలు, చైనాకు మినహాయింపు.. అసలు కారణం చెప్పిన అమెరికా

  • రష్యా చమురు కొనుగోలుపై చైనాకు అమెరికా మినహాయింపు
  • భారత్‌పై మాత్రం 50 శాతం వరకు సుంకాలు విధింపు
  • కారణాలు వివరించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
  • చైనా చమురును శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్ముతోందని వెల్లడి
  • చైనాపై ఆంక్షలు విధిస్తే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని ఆందోళన
  • యూరప్ దేశాల నుంచే ఆందోళనలు వ్యక్తమయ్యాయని వ్యాఖ్య
రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ద్వితీయ శ్రేణి ఆంక్షల నుంచి ఎందుకు మినహాయింపు ఇచ్చారో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్ల‌డించారు. చైనాపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఆయన తెలిపారు.

ఆదివారం ‘ఫాక్స్ బిజినెస్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రూబియో ఈ కీలక విషయాలు వెల్లడించారు. "చైనా కొనుగోలు చేస్తున్న రష్యా చమురును పరిశీలిస్తే, అందులో అధిక భాగాన్ని శుద్ధి చేసి తిరిగి ప్రపంచ మార్కెట్‌కు, ముఖ్యంగా యూరప్‌కు అమ్ముతున్నారు. యూరప్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి సహజ వాయువును కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు చైనాపై ఆంక్షలు విధిస్తే, శుద్ధి చేసిన ఆ చమురు ప్రపంచ మార్కెట్‌కు అందదు. దీంతో చమురు కొనే ప్రతి ఒక్కరూ అధిక ధర చెల్లించాల్సి వస్తుంది లేదా ప్రత్యామ్నాయ వనరులను వెతుక్కోవాల్సి ఉంటుంది" అని ఆయన వివ‌రించారు.

చైనా, భారత్‌లపై 100 శాతం టారిఫ్‌లు విధించాలని సెనేట్‌లో బిల్లు ప్రతిపాదించినప్పుడు పలు యూరప్ దేశాల నుంచి తమకు ఆందోళనలు వ్యక్తమయ్యాయని రూబియో తెలిపారు. పత్రికా ప్రకటనల ద్వారా కాకుండా, తెర వెనుక వారు తమ ఆందోళనలను తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. చైనా నుంచి శుద్ధి చేసిన రష్యా చమురును కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలే, చైనాపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోరినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు.

యూరప్ దేశాలు రష్యా నుంచి నేరుగా ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు వాటిపై కూడా ఆంక్షలు విధిస్తారా? అని అడిగిన ప్రశ్నకు రూబియో స్పందిస్తూ, ఆ దేశాలతో వాగ్వాదానికి దిగాలనుకోవడం లేదని అన్నారు. ఈ విషయంలో యూరప్ నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.


More Telugu News