Rishabh Pant: పంత్ గాయం ఎఫెక్ట్: క్రికెట్‌లో కొత్త రూల్ తీసుకువచ్చిన బీసీసీఐ

BCCI Introduces New Rule After Rishabh Pant Injury
  • దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ సరికొత్త నిబంధన
  • తీవ్ర గాయాలైతే ఆటగాడిని మార్చుకునే అవకాశం
  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అమలు కాని నియమం
భారత క్రికెట్‌లో ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకోనుంది. ఇటీవ‌ల రిష‌భ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి జ‌ట్టుకు దూరమవ్వడంతో, టీమ్‌లు నష్టపోకుండా ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీనిని 'సీరియస్ ఇంజ్యూరీ రీప్లేస్‌మెంట్'గా పిలుస్తున్నారు. ఈ నియమం 2025-26 దేశవాళీ సీజన్ నుంచి అమల్లోకి రానుంది.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత ఆటగాడు రిషభ్ పంత్ పాదానికి ఫ్రాక్చర్ కావడం, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం డిస్‌లొకేషన్‌కు గురికావడంతో ఇరు జట్లు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకే ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే కంకషన్ (తల గాయం) కోసం రీప్లేస్‌మెంట్ నిబంధన ఉన్నప్పటికీ, ఇతర తీవ్ర గాయాలకు ఆ అవకాశం లేదు. ఆట మధ్యలో ఎవరైనా ఆటగాడు బంతి తగలడం వల్ల ఎముక విరగడం, తీవ్రమైన కోత లేదా కీలు స్థానభ్రంశం వంటి గాయాలపాలైతే, అతని స్థానంలో సమాన నైపుణ్యం ఉన్న మరో ఆటగాడిని తీసుకునేందుకు ఈ నిబంధన వీలు కల్పిస్తుంది.

ఈ రీప్లేస్‌మెంట్‌కు మ్యాచ్ రిఫరీ తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. గాయం తీవ్రతను నిర్ధారించడానికి ఆయన వైద్యులు, ఫీల్డ్ అంపైర్లతో చర్చిస్తారు. టాస్ సమయంలో ప్రకటించిన సబ్‌స్టిట్యూట్ జాబితా నుంచే ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ వికెట్ కీపర్ గాయపడి, జాబితాలో మరో కీపర్ లేకపోతే బయటి నుంచి కూడా అనుమతించే అవకాశం ఉంది. గాయపడిన ఆటగాడికి ఉన్న హెచ్చరికలు లేదా పెనాల్టీ సమయం కొత్తగా వచ్చిన ఆటగాడికి కూడా వర్తిస్తాయి.

పరిమిత ఓవర్లకు వర్తించదు!

ఈ కొత్త నిబంధన కేవలం సీకే నాయుడు ట్రోఫీ (అండర్-19)తో పాటు ఇతర మల్టీ-డే డొమెస్టిక్ టోర్నమెంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు గానీ, ఐపీఎల్‌కు గానీ ఇది వర్తించదని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ నిబంధనను ఐసీసీ అంతర్జాతీయ స్థాయిలో అమలు చేయడం లేదు. అయితే, భారత దేశవాళీ క్రికెట్‌లో దీని ఫలితాలను బట్టి భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్‌లోనూ ఇలాంటి మార్పులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Rishabh Pant
BCCI
serious injury replacement
cricket rules
domestic cricket
Indian cricket
injury replacement rule
sports injuries
cricket India
match referee

More Telugu News