Peethala Sujatha: వైఎస్ భారతి కూడా పులివెందుల నుంచి అమరావతికి ఫ్రీగా రావచ్చు: పీతల సుజాత

Peethala Sujatha Says YS Bharathi Can Travel Free to Amaravati
  • మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ఓ గొప్ప కానుక అన్న పీతల సుజాత
  • పథకంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపాటు
  • ఆడబిడ్డలను వృద్ధిలోకి తేవడమే టీడీపీ విధానమని వ్యాఖ్య
మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' పథకంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ నాయకురాలు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌ పీతల సుజాత తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళల హక్కుల కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చారని, ఆ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు బీజం వేశారని గుర్తు చేశారు. నేడు కోటి మంది మహిళలు ఆ సంఘాల ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు.

మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని పీతల సుజాత అన్నారు. రాష్ట్రంలోని మహిళల తరఫున 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగలాగే ఈ పథకాన్ని కూడా మహిళలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇంత మంచి పథకంపై వైసీపీకి చెందిన పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సుజాత తెలిపారు. గత ప్రభుత్వంలా కాకుండా, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేశామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వైఎస్ భారతి కూడా పులివెందుల నుంచి అమరావతికి జీరో ఛార్జీతో రావొచ్చని ఆమె అన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రానున్న నాలుగేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేసి, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళతామని సుజాత ధీమా వ్యక్తం చేశారు. 

Peethala Sujatha
Sthree Shakthi Scheme
YS Bharathi
TDP
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Andhra Pradesh
Free Bus Travel

More Telugu News