KTR: కాళేశ్వరంను 'కూలేశ్వరం' అన్నారు... పోలవరంను 'కూలవరం' అనే దమ్ముందా?: కేటీఆర్

KTR asks if Polavaram will be called Koolavaram like Kaleshwaram
  • మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అన్నారని కేటీఆర్ మండిపాటు
  • పోలవరం కాఫర్ డ్యాం రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ మౌనంగా ఉందని విమర్శ
  • ఇది కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని ఆరోపణ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతింటే 'కూలేశ్వరం' అంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు, ఇప్పుడు రెండోసారి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టును 'కూలవరం' అని నిందించే ధైర్యం ఉందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ వద్ద చిన్న సమస్య తలెత్తగానే, 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను రంగంలోకి దించి బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు. కానీ, సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టయిన పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి దెబ్బతిన్నా కేంద్ర సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు మేర కాఫర్ డ్యామ్ కొట్టుకుపోతే, యుద్ధప్రాతిపదికన గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో, తెలంగాణలో 20 నెలలు గడుస్తున్నా మేడిగడ్డ వద్ద కనీస మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వమే కారణమని విమర్శించారు. కాళేశ్వరంకు ఒక నీతి... పోలవరంకు మరో నీతా? అని మండిపడ్డారు.

గతంలో 2020లో పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా, తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయినా ఎన్డీఎస్ఏ స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఇది కేవలం ప్రాజెక్టుల సమస్య కాదని, తెలంగాణ రైతాంగానికి జీవనాధారమైన కాళేశ్వరంపై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 
KTR
KTR comments
Kaleshwaram project
Polavaram project
Telangana politics
BRS party
National Dam Safety Authority
NDSA

More Telugu News