బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదు: సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ

  • బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని కేంద్రం స్పష్టీకరణ
  • ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగ గందరగోళం తప్పదన్న కేంద్రం
  • గడువు పెట్టడం వల్ల అత్యున్నత పదవుల గౌరవం తగ్గుతుందని ఆందోళన
శాసనసభలు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదముద్ర వేయడానికి కాలపరిమితి విధించే అధికారం న్యాయస్థానాలకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే, అది రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టు జారీచేసిన నోటీసులకు కేంద్రం ఈ మేరకు బదులిచ్చింది.

బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించడం ద్వారా రాష్ట్రపతి, గవర్నర్ల వంటి అత్యున్నత పదవుల గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు పదవులు ప్రజాస్వామ్య పాలనలో ఉన్నత పదవులని పేర్కొంది. వారి అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని తెలిపింది.

ఒకవేళ వారి విధి నిర్వహణలో ఏవైనా లోపాలు తలెత్తితే, వాటిని న్యాయవ్యవస్థ జోక్యంతో కాకుండా రాజ్యాంగబద్ధమైన యంత్రాంగాల ద్వారానే సరిదిద్దాలని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ రకమైన జోక్యం వల్ల కొన్ని అనవసర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని తన అఫిడవిట్‌లో పేర్కొంది. 


More Telugu News