పటౌడీ ట్రోఫీ పేరు 'అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ'గా మార్పు.. సచిన్‌పై మాజీ క్రికెటర్ ఫైర్

  • ఇది పటౌడీ క్రికెట్ వారసత్వాన్ని కించపరచడమేనన్న కర్సన్ ఘావ్రీ
  • తన పేరు పెట్టడాన్ని సచిన్ గట్టిగా వ్యతిరేకించి ఉండాల్సిందన్న మాజీ క్రికెటర్
  • అభ్యంతరం చెప్పడం వేరు.. వ్యతిరేకించడం వేరంటూ సచిన్‌పై విమర్శలు
  • ఒక గొప్ప వ్యక్తి స్థాయిని కించపరుస్తున్నారంటూ సచిన్‌పై ఆగ్రహం
పటౌడీ ట్రోఫీ పేరును 'అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ'గా మార్చడంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కర్సన్ ఘావ్రీ తీవ్రంగా స్పందించాడు. పేరును మార్చడం అంటే పటౌడీ క్రికెట్ వారసత్వాన్ని కించపరచడమేనని, ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు సచిన్ గట్టిగా అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. 

పటౌడీ ట్రోఫీ పేరును మార్చడంపై ఘావ్రీ మాట్లాడుతూ.. ఇది చాలా తప్పు అని అన్నాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ సిరీస్‌ను ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ అంటారని, అలాగే భారత్-ఆస్ట్రేలియా ట్రోఫీని బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అంటారని గుర్తుచేశారు. ఒకవేళ దాని పేరు మారిస్తే గావస్కర్ మొత్తం భారతదేశాన్నే కదిలించి ఉండేవాడని వికీ లాల్వానీ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘావ్రీ చెప్పాడు. 

పేరు మార్పు అంటే పటౌడీ జ్ఞాపకాలను అగౌరవపరచడమేనని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను కూడా ఘావ్రీ తప్పుపట్టాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లతో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉండాల్సిందని అన్నాడు. ‘టైగర్ పటౌడీ పేరును తొలగించకుండా బీసీసీఐ అభ్యంతరం చెప్పి ఉండాల్సింది’ అని ఘావ్రీ పేర్కొన్నాడు.

సచిన్‌పై ఘావ్రీ విమర్శలు
సచిన్ టెండూల్కర్ మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, ఘావ్రీ మాత్రం సచిన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ట్రోఫీ పేరు మార్చి నీ పేరు, అండర్సన్ పేరు పెడతామన్నప్పుడు సచిన్ నో అని చెప్పి ఉండాలి. అభ్యంతరం చెప్పడం వేరు, గట్టిగా నిరాకరించడం వేరు" అని అన్నాడు. ఘావ్రీ 39 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. "ముందు మీరు గట్టిగా నిలబడి 'నా పేరు వద్దు, టైగర్ పటౌడీ పేరు ఇప్పటికే ఉంది. ఆయన భారత క్రికెట్‌కు ఒక లెజెండ్. పతకాలు ఇవ్వాలనుకుంటే మా పేర్లు ఉపయోగించండి, కానీ ట్రోఫీ పేరు అలాగే ఉండాలి' అని చెప్పి ఉండాల్సింది.  మీరు ఒక గొప్ప వ్యక్తి స్థాయిని కించపరుస్తున్నారు" అని ఘావ్రీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News