నాకు జరిగిన అన్యాయాలను త్వరలోనే వెల్లడిస్తా... ఆరోజు పెద్ద యుద్ధమే జరుగుతుంది: ఉదయభాను

  • ఇండస్ట్రీలో యాంకరింగ్ ను కొన్ని గ్రూపులు సిండికేట్ గా మార్చాయన్న ఉదయభాను
  • తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయని వ్యాఖ్య
  • తనకు ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అయ్యాయో ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుందన్న భాను
ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఉదయభాను ఆ తర్వాత కాస్త నెమ్మదించారు. పెళ్లి చేసుకుని, పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను చాలా కాలంపాటు కుటుంబానికే అంకితమయ్యారు. ఇప్పుడు తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాజాగా ఓ ప్రమోషన్స్ ఈవెంట్, మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ... ఇండస్ట్రీలో యాంకర్ లకు ఎదురవుతున్న అసమానతలపై గళమెత్తారు. ఇండస్ట్రీలోని కొన్ని గ్రూపులు యాంకరింగ్ ను సిండికేట్ గా మార్చేశాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఉదయభాను మాట్లాడుతూ... ఈ రంగంలో తనకు ఎదురైన అనుభవాలే తనను అలా మాట్లాడేలా చేశాయని చెప్పారు. ఎన్నోసార్లు ఈవెంట్ కు రెడీ అయి వెళ్లిన తర్వాత... ఆ ఛాన్స్ మరొకరికి వెళ్లిందని తెలిసి వెనక్కి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆమె తెలిపారు. కొన్ని ఛానల్స్ తన డేట్స్ తీసుకుని... ఆ తర్వాత తనకు సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'హయ్యెస్ట్ పెయిడ్ యాంకర్' అంటూ తనకు ట్యాగ్ వేసినప్పటికీ... వాస్తవ పరిస్థితి వేరని ఆమె అన్నారు. 

తనకు ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అయ్యాయో తమ ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుందని ఉదయభాను తెలిపారు. తాను ఎప్పుడూ సెలెక్టివ్ గా ఉంటానని చెప్పారు. చిన్న ఇంటర్వ్యూలు చేస్తే చిన్న యాంకర్ల భవిష్యత్తు దెబ్బతీసినట్టు అవుతుందనే భావనతో చిన్న ఇంటర్వ్యూలు ఒప్పుకునేదాన్ని కాదని తెలిపారు. 

త్వరలోనే అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని... ఆ రోజు వచ్చినప్పుడు పెద్ద యుద్ధాలే జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాలను బహిరంగంగా చెపుతానని... ఆరోజు పెద్ద రచ్చ జరుగుతుందని చెప్పారు. తాను ఎవరినో కించపరచడానికి మాట్లాడటం లేదని... వచ్చే తరం వారికి కొద్దిపాటి అవగాహన కల్పించేందుకే మాట్లాడుతున్నానని అన్నారు. తన అభిప్రాయాలలో ఉండే ఫిలాసఫీ కెరీర్ నేర్పిన జీవిత పాఠాల వల్ల వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాస్తున్నానని చెప్పారు.  


More Telugu News