రష్యా అధ్యక్షుడితో సమావేశానికి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే వరకు రష్యాతో వ్యాపారాలు చేయబోమని స్పష్టీకరణ
  • చర్చలు సాఫిగా సాగనిస్తే పురోగతి ఉంటుందన్న ట్రంప్
  • చర్చల ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశాభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికొన్ని గంటల్లో అలస్కా వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశం కోసం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే వరకు రష్యాతో వ్యాపారాలు చేయబోమని స్పష్టం చేశారు.

సమావేశానికి పుతిన్ కొంతమంది రష్యా వ్యాపారులను వెంటబెట్టుకొని వస్తున్నట్లు తెలిసిందని, వాళ్లు అమెరికాతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఇది చాలా మంచి విషయమే కానీ, యుద్ధానికి ముగింపు పలికిన తర్వాత వ్యాపారాల గురించి మాట్లాడుతామని తేల్చి చెప్పారు.

చర్చలు సజావుగా సాగితే తప్పకుండా పురోగతి ఉంటుందని, లేదంటే చర్చలు త్వరగా ముగుస్తాయని ఆయన అన్నారు. చర్చల ద్వారా కచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయని భావిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. పుతిన్, తాను చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నామని, ప్రస్తుతం ఇద్దరం రెండు దేశాలకు అధ్యక్షులుగా ఉన్నామని తెలిపారు.


More Telugu News