అవకాయ పచ్చడైనా, అంతరిక్షం అయినా ముందుండేది మహిళలే: మంత్రి నారా లోకేశ్

  • విజయవాడలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభోత్సవంలో ప్రసంగం
  • సినిమాలు, వెబ్ సిరీస్‌లపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
  • మహిళలను కించపరిచే డైలాగ్స్‌పై ప్రత్యేక చట్టం తేవాలని ప్రతిపాదన
  • ఈ విషయంపై సీఎం, డిప్యూటీ సీఎంను కోరినట్లు వెల్లడి
  • మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపు
ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లేంత వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. మహిళల పట్ల అమర్యాదగా మాట్లాడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. విజయవాడలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

చలనచిత్రాలు, వెబ్ సిరీస్‌లలో మహిళలను అగౌరవపరిచేలా, కించపరిచేలా ఉండే సంభాషణలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి ధోరణులకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మహిళల పట్ల అసభ్యకరమైన డైలాగ్స్ ఉంటున్నాయి. వాటిని తొలగించేలా ఒక చట్టం తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కోరుతున్నాను" అని తెలిపారు. 

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని, వారి అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సాధికారత కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందుతుందని అన్నారు. మహిళల పట్ల గౌరవం అనేది ప్రతి ఇంట్లో నుంచే మొదలుకావాలని, ఆ సంస్కృతిని అందరూ అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


More Telugu News