మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం... మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్, లోకేశ్

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం
  • ‘స్త్రీ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం
  • ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
  • ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకు సాగిన ప్రయాణం
  • దారి పొడవునా సీఎంకు మంగళహారతులతో మహిళల ఘన స్వాగతం
  • ‘థాంక్యూ సీఎం సర్‌’ అంటూ హోరెత్తిన నినాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం నేటి నుంచి అమలు చేస్తున్నారు. 

ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.

సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. ‘థాంక్యూ సీఎం సర్‌’ అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.


More Telugu News