తొలి రోజున కలెక్షన్ల దుమ్మురేపిన రజనీకాంత్ 'కూలీ'... తమిళ సినీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్

  • ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కూలీ'
  • తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్లు రాబట్టిన 'కూలీ'
  • తమిళ సినీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్
  • భారత్‌లో రూ. 65 కోట్లతో రెండో అతిపెద్ద తమిళ ఓపెనర్
  • విదేశాల్లోనూ సరికొత్త రికార్డులు సృష్టించిన తలైవా చిత్రం
  • 'జవాన్', 'యానిమల్' చిత్రాలను దాటేసిన వసూళ్లు
  • వారాంతానికి రూ. 300 కోట్ల మార్క్ దాటే అవకాశం
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. ఆయన కథానాయకుడిగా, యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.151 కోట్లు వసూలు చేసి, తమిళ సినీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, భారతీయ సినిమా రికార్డులను సైతం తిరగరాస్తోంది.

దేశీయ మార్కెట్‌లోనూ 'కూలీ' భారీ వసూళ్లను నమోదు చేసింది. భారత్‌లో తొలిరోజు రూ.65 కోట్ల నికర వసూళ్లతో, విజయ్ నటించిన 'లియో' (రూ.66 కోట్లు) తర్వాత రెండో అతిపెద్ద తమిళ ఓపెనర్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.80 కోట్లుగా ఉన్నాయి. ఇక విదేశాల్లో అయితే 'కూలీ' హవా మాములుగా లేదు. ఉత్తర అమెరికాలో 3.04 మిలియన్ డాలర్లు, యూకేలో 124 వేల పౌండ్లు, ఆస్ట్రేలియాలో 5.35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల వసూళ్లతో తమిళ చిత్రాల్లో సరికొత్త ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది.

ఈ అసాధారణ వసూళ్లతో 'కూలీ' చిత్రం, 'జవాన్' (రూ.126 కోట్లు), 'యానిమల్' (రూ.116 కోట్లు), 'పఠాన్' (రూ.104 కోట్లు) వంటి బాలీవుడ్ భారీ చిత్రాల తొలిరోజు వసూళ్లను అధిగమించింది. భారతీయ సినిమాల్లో టాప్-10 అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో సగర్వంగా స్థానం సంపాదించింది. రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి భారీ తారాగణం నటించడం, స్వాతంత్ర్య దినోత్సవం సెలవు కలిసిరావడంతో సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. ఇదే జోరు కొనసాగితే, వారాంతం నాటికి ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును సునాయాసంగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


More Telugu News