పులివెందుల చరిత్రలో వైసీపీ ఎప్పుడూ ఓడిపోలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • జడ్పీటీసీ ఉప ఎన్నికపై న్యాయపోరాటం కొనసాగుతుందన్న సజ్జల
  • ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని విమర్శ
  • పోలింగ్ బూత్ లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపాటు
పులివెందుల చరిత్రలో వైసీపీ ఎన్నడూ ఓడిపోలేదని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయపోరాటం కొనసాగుతుందని చెప్పారు. జగన్ విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలో అన్ని వ్యవస్థలను కూటమి నేతలు నిర్వీర్యం చేశారని... అయినా జగన్ సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని... సీసీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వడలేదని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యక్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాము కూడా ఢీ అంటే ఢీ అని తలపడి ఉంటే ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేదని... కానీ, ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాకూడదని తాము భావించామని చెప్పారు. పోలింగ్ బూత్ లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపడ్డారు. 15 పోలింగ్ బూత్ లకు 2 వేల మంది పోలీసులను పెట్టారని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి చూస్తే ఎంతమంది ఓటు వేశారో, ఎంత మంది వేలికి సిరా చుక్క ఉందో తెలుస్తుందని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు.


More Telugu News