ధోనీ వల్లే నన్ను పక్కనపెట్టారు.. ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

  • 2009లో జట్టు నుంచి తన తొలగింపుపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్
  • అప్పటి కెప్టెన్ ధోనీ నిర్ణయం వల్లే ఇది జరిగిందని పరోక్ష ఆరోపణలు
  • కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో జరిగిన సంభాషణను బయటపెట్టిన మాజీ ఆల్‌రౌండర్
  • 'కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు' అని కోచ్ చెప్పారని వెల్లడి
  • ఏడో స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కావాలనేది మరో కారణంగా చెప్పారన్న ఇర్ఫాన్
  • శ్రీలంకపై మ్యాచ్ గెలిపించినా పక్కనపెట్టడంపై ఆవేదన 
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంతర్జాతీయ కెరీర్‌కు సంబంధించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. ఒకప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా వెలుగొందిన తాను 2009లో ఉన్నట్టుండి జట్టుకు ఎలా దూరమయ్యాడో, ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారో తాజాగా వెల్లడించాడు. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లే తనను పక్కనపెట్టారని పరోక్షంగా ఆరోపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్ 2009లో జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నాడు. "శ్రీలంకతో జరిగిన ఒక సిరీస్‌లో నేను, నా సోదరుడు యూసుఫ్ కలిసి అద్భుతమైన విజయాన్ని అందించాం. కేవలం 27-28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించాం. అలాంటి ప్రదర్శన తర్వాత ఎవరినైనా ఏడాది పాటు పక్కనపెడతారా?" అని ఆయన ప్రశ్నించాడు. ఆ సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనలో తనకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీంతో తాను నేరుగా అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను కలిసి, తనను ఎందుకు పక్కనపెట్టారని అడిగానని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. దానికి కిర్‌స్టెన్ రెండు కారణాలు చెప్పారని వెల్లడించారు. "మొదటిది, 'కొన్ని విషయాలు నా చేతుల్లో లేవు' అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎవరి చేతుల్లో ఉన్నాయని నేను అడగకపోయినా, నాకు తెలుసు. తుది జట్టు ఎంపిక ఎప్పుడూ కెప్టెన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు" అని ఇర్ఫాన్ వివరించాడు.

"ఇక రెండో కారణంగా, ఏడో స్థానంలో జట్టుకు ఒక బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరమని కిర్‌స్టెన్ చెప్పాడు. నా సోదరుడు యూసుఫ్ ఒక బ్యాటింగ్ ఆల్‌రౌండర్, నేను బౌలింగ్ ఆల్‌రౌండర్. జట్టులో ఒకరికే స్థానం ఉందని వారు భావించారు" అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే, ఏ కెప్టెన్‌కైనా తన జట్టును నడిపించుకునే హక్కు ఉంటుందని, ధోనీ తీసుకున్న నిర్ణయం సరైనదా, కాదా అనే చర్చలోకి తాను వెళ్లబోనని ఆయన స్పష్టం చేశాడు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ కెరీర్ క్రమంగా మందగించి, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.


More Telugu News