Donald Trump: భారత్‌పై ట్రంప్ ఆగ్రహం.. 50 శాతం సుంకాల వెనుక అసలు కారణం ఇదీ: మాజీ దౌత్యవేత్త

Vikas Swaroop analyzes Trump anger on India
  • భారత వస్తువులపై 50 శాతం మేర టారిఫ్‌లు విధించిన ట్రంప్
  • పాక్‌తో ఉద్రిక్తతల తగ్గుదలలో తన పాత్రను భారత్ గుర్తించలేదని ఆగ్రహం
  • 'ఆపరేషన్ సింధూర్‌' కాల్పుల విరమణలో మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరించడం
  • బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యత్వంపై కూడా ట్రంప్ అసంతృప్తి
  • ట్రేడ్ చర్చల్లో అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదని వెల్లడి
భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా 50 శాతం మేర భారీ సుంకాలు విధించడం వెనుక బలమైన కారణాలున్నాయని ప్రముఖ రచయిత, మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్ తెలిపారు. అందులో ప్రధానమైనది 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించడంలో తన పాత్రను భారత్ గుర్తించకపోవడమేనని ఆయన సంచలన విశ్లేషణ చేశారు. వాణిజ్యపరమైన ఒత్తిళ్లతో పాటు, ట్రంప్ వ్యక్తిగత అసంతృప్తి కూడా ఈ కఠిన నిర్ణయానికి దారితీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వికాస్ స్వరూప్ ఈ విషయాలను వెల్లడించారు. "భారత్‌పై ట్రంప్ ఇంత ఆగ్రహంగా ఉండటానికి మూడు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, పాకిస్థాన్‌తో అణుయుద్ధం ముప్పును తానే ఆపానని ట్రంప్ దాదాపు 30 సార్లు చెప్పారు. కానీ, ఆ కాల్పుల విరమణలో బయటివారి మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోమని భారత్ మొదటి నుంచి స్పష్టం చేస్తూ వస్తోంది. అది కేవలం భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని చెబుతోంది. దీంతో తన పాత్రను గుర్తించలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్ ఆయన పాత్రను గుర్తించడమే కాకుండా, నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేసింది. ఇది ట్రంప్ కోపానికి ఆజ్యం పోసింది" అని స్వరూప్ వివరించారు.

ట్రంప్ అసంతృప్తికి రెండో కారణం బ్రిక్స్ కూటమి అని స్వరూప్ తెలిపారు. "బ్రిక్స్ ఒక అమెరికా వ్యతిరేక కూటమి అని, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. అందువల్ల ఆ కూటమిలో భారత్ సభ్యత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఇక మూడో కారణంగా, వాణిజ్య చర్చల్లో భాగంగా తమ వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో మరింత ప్రాముఖ్యత కల్పించాలన్న అమెరికా డిమాండ్లకు భారత్ తలొగ్గకపోవడమేనని ఆయన అన్నారు. ఈ ఒత్తిడి వ్యూహాల్లో భాగంగానే సుంకాలను ఆయుధంగా వాడుతున్నారని విశ్లేషించారు.

కెనడాలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన వికాస్ స్వరూప్, ప్రఖ్యాత ‘క్యూ అండ్ ఏ’ నవలా రచయితగా కూడా సుపరిచితులు. కాగా, గత జులైలో భారత వస్తువులపై 25 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్, కొద్ది రోజులకే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై మరో 25 శాతం సుంకం విధించి, మొత్తం భారాన్ని 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
Donald Trump
USA
India
Tariff
Pakistan

More Telugu News