IMD Alert: ఏపీలో రాగల 24 గంటల్లో పలు జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' ముప్పు: ఐఎండీ అలర్ట్

IMD Alert Flash Flood Warning Issued for Several AP Districts
  • బంగాళాఖాతంలో అల్పపీడనంతో కోస్తాంధ్రలో కుండపోత వర్షాలు
  • కోస్తా, యానాంకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
  • వివిధ పోర్టులలో ప్రమాద సూచికలు.. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో, రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు యానాంలో ఈ ముప్పు అధికంగా ఉందని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.

వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులు దాటుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని, చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.

ప్రస్తుత అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర-ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. 
IMD Alert
Andhra Pradesh
Flash floods
Krishna river
Coastal Andhra
Heavy rainfall
Weather forecast
Cyclone alert
Yanam
Prakhar Jain

More Telugu News