పులివెందుల విజేత లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించిన నారా భువనేశ్వరి

  • పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విక్టరీ
  • ఘనవిజయం సాధించిన బీటెక్ రవి అర్ధాంగి లతారెడ్డి 
  • పులివెందులలో  గెలిస్తే జోష్ ఎక్కువ కదా అంటూ భువనేశ్వరి స్పందన 
  • మనం అందరం ఒకే కుటుంబం అంటూ వ్యాఖ్యలు
పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీటెక్ రవి అర్థాంగి మారెడ్డి లతారెడ్డి తిరుగులేని విజయం సాధించడం పట్ల టీడీపీలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇది కేవలం జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడగా... లతారెడ్డి ఘనవిజయంతో టీడీపీ అధినాయకత్వం సైతం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి తాజాగా పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అబినందనలు తెలిపారు. 

"లత గారూ.. మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నాం" అని అన్నారు. అందుకు లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. "థాంక్యూ అమ్మా... నా విజయానికి మీరు కూడా కారణం అమ్మా... అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా..." అంటూ వినమ్రంగా బదులిచ్చారు. అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ... "అవును, ఈ విజయం అందరిదీ... ప్రతి ఒక్కరిదీ... అయినా పులివెందులలో  గెలుపు అంటే ఇంకొంచెం జోష్ ఎక్కువ కదా! మీకు మరొక్కసారి శుభాభినందనలు... మనందరం ఒకే కుటుంబం" అని అన్నారు. "మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా... జై తెలుగుదేశం" అంటూ లతారెడ్డి బదులిచ్చారు. 


More Telugu News