హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. కొత్త ఖాతాదారులకు షాక్!

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మారిన కనీస బ్యాలెన్స్ నిబంధనలు
  • ఆగస్టు 1 తర్వాత కొత్తగా ఖాతా తెరిచే వారికే ఈ మార్పులు
  • ప్రస్తుత ఖాతాదారులకు పాత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టీకరణ 
  • పట్టణ, సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో కనీస బ్యాలెన్స్ రూ. 25,000కి పెంపు
  • గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిమితి రూ. 10,000గా నిర్ణయం
  • జీతాలు, బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మినహాయింపు యథాతథం
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ ఖాతాలకు సంబంధించిన కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (AMB) నిబంధనలపై కీలక ప్ర‌క‌ట‌న చేసింది. కొత్తగా సేవింగ్ ఖాతాల‌ను తెరిచేవారికి కనీస బ్యాలెన్స్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుత ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చిచెప్పింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు ఒకటి నుంచి తెరిచిన ఖాతాలకు వర్తిస్తాయ‌ని పేర్కొంది.

బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆగస్టు 1 తర్వాత మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని శాఖల్లో కొత్తగా సేవింగ్స్ ఖాతా తెరిచే వారు ఇకపై నెలవారీ సగటున రూ. 25,000 కనీస బ్యాలెన్స్‌ను పాటించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ. 10,000గా ఉండేది. అదే విధంగా, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని శాఖల్లో కూడా కనీస బ్యాలెన్స్‌ను రూ. 5,000 నుంచి ఏకంగా రూ. 25,000కు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లోని శాఖలకు ఈ పరిమితిని రూ. 5,000 నుంచి రూ. 10,000కు సవరించింది.

అయితే, ఆగస్టు 1కి ముందు ఖాతాలు తెరిచిన పాత కస్టమర్లకు మాత్రం పాత నిబంధనలే కొనసాగుతాయని బ్యాంకు స్పష్టం చేసింది. అంటే, పట్టణ ప్రాంతాల ఖాతాదారులు రూ. 10,000, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారు రూ. 5,000 కనీస బ్యాలెన్స్ కొనసాగిస్తే సరిపోతుంది. ఈ మార్పుల నుంచి జీతాల ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు మినహాయింపు ఇచ్చింది. ఇవి మునుపటిలాగే జీరో-బ్యాలెన్స్ ఖాతాలుగా కొనసాగుతాయి.

ఇటీవల ఐసీఐసీఐ బ్యాంకు కూడా కొత్త ఖాతాలకు కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం కనీస బ్యాలెన్స్ నిబంధనలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం ద్వారా కొత్త ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కనీస బ్యాలెన్స్ నిబంధనలు అనేవి బ్యాంకుల వాణిజ్యపరమైన నిర్ణయమని, వాటిని నిర్దేశించుకునే స్వేచ్ఛ బ్యాంకులకు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది.


More Telugu News