కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారం!

  • దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి ఘటన
  • పార్టీ పేరుతో ఇంటికి పిలిచి అఘాయిత్యం
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
యువతిని పార్టీకి ఆహ్వానించిన స్నేహితులు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం.. పార్టీ కోసం స్నేహితుడి ఆహ్వానం మేరకు 24 ఏళ్ల యువతి అతడి ఇంటికి వెళ్లింది. అప్పటికే అక్కడ మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. పార్టీ పేరుతో ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అందరూ కలిసి ఆమెను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దుశ్చర్యను వారు వీడియో కూడా తీశారు. 

ఈ ఘటన జరిగిన దాదాపు 13-14 గంటల తర్వాత బాధితురాలు తన సోదరితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను గుర్తించి, పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వాస్తవాలను ధ్రువీకరించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News