పీటల మీద నిలిచిపోయిన వివాహం.. మొదటి భార్య ఫిర్యాదుతో పెళ్లి కొడుకు ఆటకట్టు

  • మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో ఘటన
  • మొదటి వివాహం దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైన యువకుడు
  • డోర్నకల్ సీఐకి ఫోన్ చేసి విషయం చెప్పి వాట్సాప్‌లో పెళ్లి ఫొటోలు పంపిన మొదటి భార్య
  • పెళ్లిని అడ్డుకుని నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో నిన్న ఉదయం జరగాల్సిన ఒక పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోయింది. సంగారెడ్డిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించి ఈ వివాహాన్ని అడ్డుకున్నారు. స్థానిక యాదవ్ నగర్‌కు చెందిన పచ్చిపాల మహేశ్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. 

నిన్న ఉదయం పెళ్లి ముహూర్తం ఉండటంతో బంధుమిత్రులందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో సంగారెడ్డిలో ఉండే ఒక మహిళ డోర్నకల్ సీఐ రాజేష్‌కి ఫోన్ చేసి, మహేశ్ తన భర్త అని, తాము ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపింది. మహేశ్ తమ పెళ్లిని దాచి రెండో వివాహం చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేస్తూ తమ పెళ్లి ఫోటోలను వాట్సాప్‌లో పంపింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. పెళ్లి జరుగుతున్న ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో పెళ్లి నిలిచిపోయింది. పోలీసులు మహేశ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు, పెద్దలు వారికి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. మహేశ్ మొదటి పెళ్లి గురించి దాచిపెట్టి, మరో వివాహానికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు. మొదటి భార్య సకాలంలో ఫిర్యాదు చేయడంతో పెళ్లి ఆగిపోయిందని పోలీసులు వెల్లడించారు. 


More Telugu News