మరో వివాదంలో శిల్పా శెట్టి దంపతులు.. వ్యాపారికి రూ. 60 కోట్లకు టోకరా.. చీటింగ్ కేసు న‌మోదు

  • బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు
  • వ్యాపారిని రూ. 60.4 కోట్లకు మోసం చేశారని ఆరోపణలు
  • బెస్ట్ డీల్ టీవీ కంపెనీ పేరుతో పెట్టుబడులు స్వీకరించిన వైనం
  • వ్యాపారం కోసం తీసుకున్న డబ్బును వ్యక్తిగతంగా వాడుకున్నారని ఫిర్యాదు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. తమ కంపెనీలో పెట్టుబడి పేరుతో ఓ వ్యాపారి నుంచి రూ. 60.4 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలతో వీరిద్దరితో పాటు, మరో వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) చేపట్టింది.

వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అయిన దీపక్ కొఠారీ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిల్పా శెట్టి దంపతులు తనను ఉమ్మడిగా రూ. 60 కోట్లకు పైగా మోసం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాపార విస్తరణ పేరుతో 2015 నుంచి 2023 మధ్య కాలంలో తన నుంచి డబ్బులు తీసుకున్నారని, అయితే ఆ నిధులను వారు తమ సొంత ఖర్చులకు వాడుకున్నారని కొఠారీ ఆరోపించారు.

రాజేశ్‌ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పరిచయమయ్యారని కొఠారీ తెలిపారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత, 2017లో మరో ఒప్పందంలో విఫలమవడంతో బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాలా ప్రక్రియలోకి వెళ్లినట్లు తనకు తెలిసిందని కొఠారీ వాపోయారు.

కొఠారీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం జరిగిన మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, ఈ కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News