పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల రగడ.. వైసీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

  • ఒంటిమిట్ట, పులివెందుల ఉపఎన్నికలపై తీవ్ర దుమారం
  • వైసీపీ నేతలు పోలీసులను బెదిరించారని టీడీపీ ఆరోపణ
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ బృందం
  • దౌర్జన్యానికి పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • జగన్ పాలనపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ తీవ్ర విమర్శలు
  • మూడు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటేశారన్న దేవినేని ఉమ
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరించి, దూషణలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపించింది. ఈ మేరకు బుధవారం నాడు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ నేతృత్వంలోని బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ)ను కలిసి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడి, వైసీపీ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే జగన్‌ ఓర్వలేరా?: వర్ల రామయ్య

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ, "ఐదేళ్ల రాక్షస పాలనను జగన్ రెడ్డి అప్పుడే మరిచిపోయి, 15 నెలల చంద్రబాబు పాలనపై విమర్శలు చేయడం దొంగే దొంగ అన్నట్లుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా ప్రత్యర్థులపై దాడులు చేయించి, వారి ఇళ్లలో సారా సీసాలు పెట్టి అరెస్టులు చేయించిన చరిత్ర జగన్‌ది. ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజలు మూడు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని వ్యక్తిగతంగా దూషించడం, ఆయన శరీరాకృతిని కించపరచడం చట్టరీత్యా నేరం. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఎంపీ అవినాశ్ రెడ్డి, అధికారులను బెదిరిస్తున్న వైసీపీ నేతలపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.

అసెంబ్లీకి రావడానికే జగన్‌కు భయం: దేవినేని ఉమ
మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ, "గత 30 ఏళ్లుగా పులివెందుల, కడప జిల్లాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఇప్పుడు అదే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. గతంలో వేల స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర వారిది. ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే రీపోలింగ్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. అసెంబ్లీకి రావాలంటేనే జగన్‌కు ధైర్యం చాలడం లేదు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎన్నికలు అద్భుతంగా జరిగితే, ఆయనపై విమర్శలు చేస్తున్నారు. రేపటి ఫలితాల్లో ఓటమి ఖాయమని తెలిసే జగన్ ఈ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వివేకా హత్య కేసులో సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వ్యక్తి జగన్. పోలీసులపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

అసలైన రాక్షస పాలన జగన్‌దే: పంచుమర్తి అనురాధ
మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, "31 క్రిమినల్ కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరం. ‘తల్లికి వందనం’ పథకాన్ని విమర్శిస్తున్న మీరు, అమ్మఒడి పేరుతో ప్రజలను మోసం చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేసి, ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందించే ప్రయత్నాన్ని రాక్షస పాలన అనడం మీ అవివేకానికి నిదర్శనం" అని విమర్శించారు.

వైసీపీ గుర్తింపు రద్దు చేయాలి: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, "జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. అధికారం కోల్పోయినా ఆయనలో అహంకారం తగ్గలేదు. అధికారులను, ముఖ్యమంత్రిని దూషిస్తున్న ఆయన మానసిక స్థితి బాగోలేదు. ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.

ఈసీని కలిసిన వారిలో ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ కుప్పం రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News