ఆర్థిక సంస్థను నడపడం మానేసి డీజేగా ఉండు.. గోల్డ్‌మన్ సీఈఓకు ట్రంప్ చురకలు

  • గోల్డ్‌మన్ శాక్స్ సీఈఓ డేవిడ్ సోలమన్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు
  • బ్యాంకును నడపడం కంటే డీజేగా ఉండటమే మేలంటూ ఎద్దేవా
  • టారిఫ్ ప్రభావంపై గోల్డ్‌మన్ విడుదల చేసిన నివేదికే వివాదానికి కారణం
  • సుంకాల భారాన్ని అమెరికా వినియోగదారులే మోస్తున్నారని నివేదికలో వెల్లడి
  • గోల్డ్‌మన్ అంచనాలు పూర్తిగా తప్పని కొట్టిపారేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్‌మన్ శాక్స్ సీఈఓ డేవిడ్ సోలమన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బ్యాంకును నడపడం మానేసి, ఆయనకు అలవాటున్న డిస్కో జాకీ (డీజే) పని చూసుకోవడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల (సుంకాలు) ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతూ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన నివేదికపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రంప్ విధించిన సుంకాల భారాన్ని అమెరికా వినియోగదారులే మోస్తున్నారని గోల్డ్‌మన్ శాక్స్ ఆదివారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. జూన్ వరకు సుంకాల వ్యయంలో సుమారు 22 శాతం భారాన్ని వినియోగదారులే భరించారని, కొత్త టారిఫ్‌లు కూడా ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ భారం 67 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికపైనే ట్రంప్ మండిపడ్డారు.

మంగళవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందించారు. "డేవిడ్ సోలమన్, గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు. మార్కెట్‌పై, సుంకాలపై చాలా కాలం క్రితమే వారు తప్పుడు అంచనాలు వేశారు. అవి పూర్తిగా తప్పని తేలింది. అనేక ఇతర విషయాల్లోలాగే దీనిలోనూ వారు పొరబడ్డారు. డేవిడ్ వెళ్లి కొత్త ఆర్థికవేత్తను నియమించుకోవాలి, లేదంటే డీజేగా ఉండటంపై దృష్టి పెట్టాలి. అంతేకానీ, ఒక పెద్ద ఆర్థిక సంస్థను నడపాల్సిన అవసరం లేదు" అని ట్రంప్ విమర్శించారు

ట్రంప్ వాదనకు ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా మద్దతు పలికారు. "ప్రస్తుతం అమెరికాలో బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తర్వాత అత్యంత తక్కువ విశ్వసనీయత ఉన్న డేటా గోల్డ్‌మన్ శాక్స్‌దే" అని ఆయన ఎద్దేవా చేశారు. 


More Telugu News