మీ వాహనంలో E20 పెట్రోల్ వాడుతున్నారా? కేంద్రం చెప్పిన ఈ నిజాలు తెలుసుకోండి!

  • ఈ20 పెట్రోల్‌తో వాహనాలకు మెరుగైన యాక్సిలరేషన్
  • ఈ10 ఇంధనంతో పోలిస్తే 30 శాతం తక్కువ కాలుష్యం
  • మైలేజీ గణనీయంగా తగ్గుతుందన్నది అవాస్తవమ‌న్న కేంద్రం
  • వాహన ఇన్సూరెన్స్‌కు, ఈ20 వాడకానికి సంబంధం లేదని వెల్ల‌డి
  • 2026 అక్టోబర్ వరకు ఈ20 విధానం కొనసాగింపు
దేశవ్యాప్తంగా వాహనదారులు వాడుతున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) వల్ల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ దెబ్బతింటుందని వస్తున్న ఆందోళనలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. ఈ20 ఇంధనం వాడటం వల్ల వాహనాల పనితీరు తగ్గకపోగా, మరింత మెరుగవుతుందని తేల్చిచెప్పింది. ముఖ్యంగా సాధారణ పెట్రోల్ (ఈ10) తో పోలిస్తే ఈ20 వాడకంతో యాక్సిలరేషన్, రైడ్ క్వాలిటీ మెరుగ్గా ఉంటాయని, కర్బన ఉద్గారాలు సుమారు 30 శాతం వరకు తగ్గుతాయని వివరించింది.

సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌కు అధిక ఆక్టేన్ నంబర్ (సుమారు 108.5) ఉండటం వల్ల, ఆధునిక హై-కంప్రెషన్ ఇంజిన్లకు ఇది ఎంతో మేలు చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వేడిని గ్రహించే ఇథనాల్ గుణం కారణంగా ఇంజిన్‌లోని ఉష్ణోగ్రతలు తగ్గి, వాహన సామర్థ్యం పెరుగుతుందని సాంకేతిక అంశాలను వివరించింది. ముఖ్యంగా నగరాల్లో డ్రైవింగ్ చేసేవారికి మెరుగైన యాక్సిలరేషన్ ఎంతో ఉపయోగకరమని తెలిపింది.

మైలేజీ, ఇన్సూరెన్స్‌పై ఆందోళన అనవసరం
ఈ20 ఇంధనం వాడటం వల్ల మైలేజీ విపరీతంగా పడిపోతుందన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. వాహన మైలేజీ కేవలం ఇంధనంపైనే కాకుండా డ్రైవింగ్ అలవాట్లు, టైర్లలో గాలి, సరైన నిర్వహణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుచేసింది. చాలా వాహన తయారీ సంస్థలు 2009 నుంచే ఈ20కి అనుకూలమైన వాహనాలను తయారు చేస్తున్నాయని, వాటిలో మైలేజీ తగ్గే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది.

అదేవిధంగా, ఈ20 ఇంధనం వాడితే వాహనానికి బీమా వర్తించదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని కొట్టిపారేసింది. ఇది కేవలం ప్రజలలో భయాన్ని, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నమని, ఈ20 వాడకానికి, వాహన బీమా చెల్లుబాటుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

ధర: గతంలో పెట్రోల్ కంటే ఇథనాల్ చౌకగా ఉండేదని, కానీ ఇప్పుడు సేకరణ ధరలు పెరగడంతో ఇథనాల్ ధర పెట్రోల్ కన్నా ఎక్కువైందని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, ఇంధన భద్రత, రైతుల ఆదాయం, పర్యావరణ పరిరక్షణ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

పాత వాహనాలు: కొన్ని పాత వాహనాల్లోని రబ్బరు విడిభాగాలు కాస్త ముందుగా మార్చాల్సి రావచ్చని, అయితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, సాధారణ సర్వీసింగ్‌లో సులభంగా పూర్తి చేయవచ్చని తెలిపింది.

భవిష్యత్ ప్రణాళిక: ప్రస్తుతం 2026 అక్టోబర్ 31 వరకు ఈ20 విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాతి దశపై విస్తృతమైన అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే బ్రెజిల్ వంటి దేశాల్లో 27 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విజయవంతంగా వాడుతున్నారని ఉదాహరణగా చూపింది.


More Telugu News