పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచింది: మంత్రి లోకేశ్

  • పులివెందులలో 30 ఏళ్లలో తొలిసారి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారన్న లోకేశ్
  • భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజాస్వామ్యం కాదని హితవు
  • ఓటు హక్కు వినియోగించుకున్న పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన లోకేశ్ 
     
నేడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పులివెందులలో ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని తెలిపారు. దశాబ్దాల తర్వాత పులివెందుల ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు.

గత 30 సంవత్సరాలుగా పులివెందులలో భయానక వాతావరణం ఉండేదని, కానీ ఈ ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయడం గొప్ప మార్పుకు సంకేతమని లోకేశ్ పేర్కొన్నారు. స్వేచ్ఛగా ఓటు వేసిన పులివెందుల ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

వైసీపీ వైఖరిని ఎండగడుతూ, "వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే తప్ప, ప్రజలను భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిందని, ప్రస్తుతం ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించగలుగుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News