చెన్నైకి విమానం మళ్లింపు.. స్పీకర్‌కు, రామ్మోహన్ నాయుడుకు ఎంపీల ఫిర్యాదు

  • ఢిల్లీకి బయలుదేరిన విమానం చెన్నైకి మళ్లింపు
  • ఎందుకు మళ్లించారో సంస్థ వెల్లడించలేదని ఎంపీల ఫిర్యాదు
  • విమానంలో కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలు
తాము ప్రయాణిస్తున్న విమానాన్ని చెన్నైకి మళ్లించడాన్ని లోక్‌సభ సభ్యులు ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్‌తో సహా ఐదుగురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కోరారు.

పార్లమెంట్ సభ్యులు కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్ సురేశ్, ఆదూర్ ప్రకాశ్, కె. రాధాకృష్ణన్, సి. రాబర్ట్ బ్రూస్‌తో సహా 150 మంది ప్రయాణికులతో కూడిన ఎయిరిండియా విమానం ఈ నెల 10న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని చెన్నైకి మళ్లించారు.

ఆ సమయంలో బెంగళూరు, కోయంబత్తూరు వంటి ఇతర విమానాశ్రయాలు సమీపంలోనే ఉండగా చెన్నైకి మళ్లించడాన్ని ఎంపీలు ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని సంస్థ వివరించలేదని తెలిపారు. విమానాన్ని చెన్నైకి మళ్లించినప్పటికీ నేరుగా ల్యాండ్ చేయలేదని, అక్కడే గంటకు పైగా చక్కర్లు కొట్టినట్లు ఎంపీలు పేర్కొన్నారు.

తొలిసారి ల్యాండింగ్‌కు విఫలయత్నం చేశారని, బహుశా రన్‌వేపై మరో విమానం ఉండటం వల్ల ల్యాండింగ్‌ విఫలమైందని పైలట్ ప్రకటించారని తెలిపారు. ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత మరో విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై తాము ఆందోళనలు లేవనెత్తగా తప్పుడు ప్రకటనలు చేశామంటూ ఎయిరిండియా చిత్రీకరించిందని అన్నారు. తద్వారా ఎంపీల ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా తేరుకోలేదని, కొన్ని నెలలుగా అనేక సాంకేతిక లోపాల ఘటనలు నమోదవుతున్న తరుణంలో ఎయిరిండియా తీరు ఆమోదయోగ్యం కాదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు రాసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.


More Telugu News