Priyanka Gandhi: గాజా అంశం.. ప్రియాంక గాంధీకి ఇజ్రాయెల్ రాయబారి కౌంటర్

Priyanka Gandhi Criticized on Gaza Issue Gets Counter from Israel Ambassador
  • గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందన్న ప్రియాంక గాంధీ
  • 60 వేల మందిని హత్య చేసిందని ఆరోపణ
  • ప్రియాంకగాంధీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్న ఇజ్రాయెల్ రాయబారి
గాజాలో వేలాది మంది హమాస్ ఉగ్రవాదులనే తాము హతమార్చినట్లు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి వెల్లడించారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, ఇప్పటికే వేలాది మంది మరణానికి కారకులైందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రాయబారి తీవ్రంగా స్పందించారు.

ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, 60 వేల మందిని హత్య చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. వారిలో 18,430 మంది చిన్నారులేనని తెలిపారు. పిల్లలు సహా అనేక మంది ఆకలితో చనిపోయారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచం మౌనంగా ఉండటాన్ని ప్రియాంక గాంధీ ఖండించారు. గాజా విషయంలో భారత ప్రభుత్వం తీరును ఆమె విమర్శించారు.

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. 25 వేల మంది హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ హతమార్చిందని అన్నారు. సామాన్యుల వెనుక దాక్కొని హమాస్ హేయమైన చర్యలకు వ్యూహాలకు పాల్పడుతోందని, దీంతో ప్రాణనష్టం పెరుగుతోందని అన్నారు.

ఇజ్రాయెల్ 20 లక్షల టన్నుల ఆహార పదార్థాలను గాజాలోకి పంపిందని, హమాస్ మాత్రం వారిని నిర్బంధిస్తోందని ఆరోపించారు. ఇదే అక్కడ ఆకలికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు. గాజాలో మారణహోమం లేదని, గడిచిన 50 ఏళ్లలో అక్కడి జనాభా 450 శాతం పెరిగిందని అన్నారు.

Priyanka Gandhi
Israel
Gaza
Hamas
Rouven Azar
Israel Ambassador
Gaza conflict
India

More Telugu News