Ambati Rambabu: 'కాల్చి పారేస్తా' అన్న పులివెందుల డీఎస్పీపై అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu Criticizes DSPs Behavior in Pulivendula
  • పులివెందుల వైసీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలకు డీఎస్పీ వార్నింగ్
  • పోలీసు ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికా? అని ప్రశ్నించిన అంబటి
  • చంద్రబాబు, డీఐజీ అండగా ఉన్నారని అహంకారమా? అని మండిపాటు
  • ఇది డీఎస్పీ అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్య
  • వైసీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయన్న అంబటి
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లను మాత్రమే ఓటు వేసేందుకు లోపలకు అనుమతించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య కడపకు తరలించనున్నారు. 

మరోవైపు, పోలింగ్ జరగుతున్న సమయంలో పులివెందులలోని వైసీపీ కార్యాలయానికి ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో అవినాశ్ ను పోలీసులు వైసీపీ కార్యాలయంలోనే నిర్బంధించారు. దీంతో, అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైసీపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఈక్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని కార్యకర్తలను డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు. దీంతో, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడే ఉన్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వైసీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "కాల్చిపడేస్తా నా కొ..కా.. నువ్వు తాగి మాట్లాడొద్దు... ఏమనుకుంటున్నావ్‌.. యూనిఫాం ఇక్కడ" అంటూ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. 

డీఎస్పీ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారని అహంకారమా? అని మండిపడ్డారు. కార్యాలయంలో ఓవైపు ఎంపీ ఉండగానే... బయట కార్యకర్తలను కాల్చిపారేస్తాను అనడం డీఎస్పీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. టీడీపీని గెలిపించడానికే ఖాకీ దుస్తులు వేసుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బదులు పచ్చ చొక్కాలు వేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

కేవలం రెండు జడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత దారుణాలకు ఒడిగట్టాలా? అని అంబటి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు వందేళ్ల వెనుకకు తీసుకెళ్లారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రారంభించిన ఈ సంప్రదాయం ఆయనను, ఆయన కుమారుడిని వెంటాడదా? అని వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన పరిణామాలతో వైసీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయని చెప్పారు.
Ambati Rambabu
Pulivendula
YS Avinash Reddy
Andhra Pradesh Politics
ZPTC Elections
DSP Murali Naik
Koya Praveen
YSRCP
TDP
Chandrababu Naidu

More Telugu News