ప్రియురాలికి రొనాల్డో ఖరీదైన గిఫ్ట్.. ఆ ఉంగరం ధర అన్ని కోట్లా?

  • ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నిశ్చితార్థం
  • ప్రియురాలు జార్జినా రొడ్రిగ్జ్‌తో ఒక్కటి కానున్న ఫుట్‌బాలర్
  • జార్జినాకు తొడిగిన ఉంగరం విలువ రూ. 42 కోట్ల వరకు ఉంటుందని అంచనా
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ప్రకటించిన జార్జినా
  • 2016 నుంచి ప్రేమలో ఉన్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ఎనిమిదేళ్ల ప్రేమకు శుభం కార్డు వేశాడు. తన ప్రియురాలు, స్పానిష్ మోడల్ అయిన జార్జినా రొడ్రిగ్జ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ శుభవార్తను జార్జినా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రొనాల్డో తనకు తొడిగిన అత్యంత ఖరీదైన వజ్రపుటుంగరాన్ని చూపిస్తూ ఆమె షేర్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆ ఉంగరం ధరపై పెద్ద చర్చ జరుగుతోంది.

ఉంగరం విలువపై నిపుణుల అంచనా
జార్జినా వేలికి ఉన్న ఈ ఉంగరం చూడటానికి చాలా పెద్దదిగా ఉంది. దీని మధ్యలో భారీ వజ్రం, దానికి ఇరువైపులా మరో రెండు చిన్న వజ్రాలు అమర్చారు. ఆభరణాల నిపుణులు ఈ ఉంగరంపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మధ్యలో ఉన్న ప్రధాన వజ్రం సుమారు 15 నుంచి 30 క్యారెట్ల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. దీని విలువ కనీసం 2 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.8 కోట్ల నుంచి రూ. 42 కోట్ల) వరకు ఉండొచ్చని రేర్ క్యారెట్ సీఈఓ అజయ్ ఆనంద్ తెలిపారు.

ఇక‌, జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రొనాల్డోను ట్యాగ్ చేస్తూ ఒక ఉద్వేగభరితమైన క్యాప్షన్ రాశారు. "అవును, నేను ఒప్పుకుంటున్నాను. ఈ జన్మలోను, నా ప్రతి జన్మలోనూ" అంటూ తన అంగీకారాన్ని తెలిపారు. ఈ పోస్ట్ సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి చేసినట్లు జియోలొకేషన్ చూపిస్తోంది. ప్రస్తుతం రొనాల్డో అక్కడి అల్-నసర్ క్లబ్‌కు ఆడుతున్న విష‌యం తెలిసిందే.

రొనాల్డో, జార్జినా 2016 నుంచి ప్రేమలో ఉన్నారు. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా పనిచేస్తున్న స‌మ‌యంలో వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. 2017లో జ్యూరిచ్‌లో జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ అవార్డుల కార్యక్రమానికి తొలిసారిగా జంటగా హాజరై తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. వీరికి అలనా మార్టినా, బెల్లా ఎస్మరాల్డా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బెల్లాతో పాటు పుట్టిన కవల సోదరుడు ఏంజెల్ పుట్టిన కొద్దిసేపటికే దురదృష్టవశాత్తు మరణించాడు. రొనాల్డోకు అంతకుముందే సరోగసీ ద్వారా, ఇతర సంబంధాల ద్వారా మరో ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎంగేజ్‌మెంట్ వార్తతో వారి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ జంట‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


More Telugu News