తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు.. జగన్ మేనమామపై కేసు నమోదు

  • తిరుమల శ్రీవారి ఆలయం వద్ద రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు 
  •  టీటీడీ నిబంధనలను ఉల్లంఘించారంటూ విజిలెన్స్ ఫిర్యాదు
  •  గత నవంబర్‌లోనే రాజకీయ ప్రసంగాలపై టీటీడీ బోర్డు నిషేధం
  •  వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తిరుమల క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించేలా రాజకీయ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని రాజకీయ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేదా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదని, క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు టీటీడీ పాలకమండలి గత ఏడాది నవంబర్ 18న ఓ కీలక తీర్మానం చేసింది.

రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఈ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారి దామోదర్ ఆదివారం రాత్రి తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డిపై ఏపీ పీఆర్ యాక్ట్-1994, ఎండోమెంట్ యాక్ట్-1984, బీఎన్ఎస్ సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News