ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి మార్గదర్శకాలు విడుదల... ఈ బస్సుల్లో ఉచితం వర్తించదు!

  • ఈ నెల 15న ప్రారంభం కానున్న ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం
  • ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడి
  • అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచితం వర్తించదు
ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం 'స్త్రీ శక్తి' పేరుతో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతోంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెప్పింది. 

మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. 

సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
 


More Telugu News