అదే పనిగా మొబైల్ చూస్తే పిల్లల్లో గుండె జబ్బులు!

  • డెన్మార్క్‌లో 1000 మందికిపైగా నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాల వెల్లడి
  • అధిక స్క్రీన్ టైమ్, నిద్రలేమికి, గుండె సంబంధిత వ్యాధుల మధ్య లోతైన సంబంధం
  • అధిక స్క్రీన్ టైమ్‌తో యుక్త వయసు వారిలో పెరిగే ‘కార్డియోమెటబాలిక్’ రిస్క్
పిల్లలకు సెల్‌ఫోన్ దొరికితే చాలు ఈ లోకాన్ని మర్చిపోతారు. వారిని అలాగే వదిలేస్తే తిండీ తిప్పలు లేకుండా 24 గంటలూ దానికే అతుక్కుపోతారు. అయితే, ఇలా అధిక స్క్రీన్ టైమ్ పిల్లల గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్'లో ప్రచురితమైన ఈ పరిశోధన, అధిక స్క్రీన్ టైమ్, నిద్రలేమి, గుండె సంబంధిత వ్యాధుల మధ్య లోతైన సంబంధం ఉందని వెల్లడించింది.

డెన్మార్క్‌లో 1,000 మందికి పైగా తల్లీ పిల్లలపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం ఒక అదనపు గంట స్క్రీన్ టైమ్ పిల్లలు, యుక్తవయసు వారిలో ‘కార్డియోమెటబాలిక్ రిస్క్‌’ను పెంచుతుంది. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు స్క్రీన్‌లు వాడే పిల్లల్లో మెటబాలిక్ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి సహజ నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుందని, దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయని పరిశోధన పేర్కొంది.

పరిశోధకులు అధిక స్క్రీన్ టైమ్ ఉన్నవారి రక్తంలో ఒక ప్రత్యేకమైన 'మెటబాలిక్ సిగ్నేచర్'ను గుర్తించారు. ఇది అధిక ట్రైగ్లిసరైడ్స్ (రక్తంలో కొవ్వు), గుండె జబ్బులకు కారణమయ్యే ఇతర బయోమార్కర్‌లను సూచిస్తుంది. స్క్రీన్ టైమ్ ప్రభావం అబ్బాయిల్లో ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న అబ్బాయిల్లో బీఎంఐ, కొవ్వు, కండరాల బరువు గణనీయంగా పెరిగాయి.   


More Telugu News