గాజాలో మీడియా టెంట్‌పై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టుల మృతి

  • గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి వద్ద ప్రెస్ టెంట్‌పై ఇజ్రాయెల్ దాడి
  • మృతుల్లో ఒకరిని ఉగ్రవాదిగా ప్రకటించిన ఇజ్రాయెల్ 
  • లక్షిత దాడిని తీవ్రంగా ఖండించిన అంతర్జాతీయ జర్నలిస్టుల సంఘాలు
  • చనిపోవడానికి ముందు జర్నలిస్ట్ అనస్ అల్-షరీఫ్ భావోద్వేగ పోస్ట్
  • గాజా యుద్ధంలో ఇప్పటివరకు 200 మంది మీడియా సిబ్బంది మృతి
గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వెలుపల మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అల్ జజీరా నెట్‌వర్క్ ఆదివారం ప్రకటించింది.

ఈ ఘటనలో తమ ప్రతినిధులు అనస్ అల్-షరీఫ్ (28), మహమ్మద్ ఖ్రీఖేతో పాటు కెమెరామెన్లు ఇబ్రహీం జహర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలివా మరణించినట్లు అల్ జజీరా ఒక ప్రకటనలో తెలిపింది. తమ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని తీవ్రంగా ఆరోపించింది.

ఉగ్రవాదిని లక్ష్యం చేసుకున్నామన్న ఇజ్రాయెల్
ఈ దాడిని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. అయితే, తాము అల్ జజీరా జర్నలిస్ట్ అనస్ అల్-షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, అతను జర్నలిస్టు ముసుగులో ఉన్న ఒక 'ఉగ్రవాది' అని పేర్కొంది. హమాస్ ఉగ్రవాద సంస్థలో షరీఫ్ ఒక సెల్‌కు నాయకత్వం వహించాడని, ఇజ్రాయెల్ పౌరులు, సైనికులపై రాకెట్ దాడులకు బాధ్యత వహించాడని ఐడీఎఫ్ ఆరోపించింది.

జర్నలిస్ట్ చివరి పోస్ట్
చ‌నిపోవ‌డానికి ముందు అనస్ అల్-షరీఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయని పోస్టులు చేశారు. ఆయన మరణించినట్లు వార్తలు వచ్చిన తర్వాత, అతని ఖాతా నుంచి ఒక పోస్ట్ ప్రచురితమైంది. "నా ఈ మాటలు మిమ్మల్ని చేరితే, నన్ను చంపి నా గొంతును నొక్కడంలో ఇజ్రాయెల్ సక్సెస్ అయిందని తెలుసుకోండి" అని అందులో ఉండటం పలువురిని కదిలించింది.

తీవ్రంగా ఖండించిన మీడియా సంఘాలు
ఈ హత్యలను 'కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) తీవ్రంగా ఖండించింది. "ఎలాంటి ఆధారాలు చూపకుండా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్రవేయడం ఇజ్రాయెల్ ఉద్దేశాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది" అని సీపీజే ప్రాంతీయ డైరెక్టర్ సారా ఖుదా అన్నారు. జర్నలిస్టులు సామాన్య పౌరులని, వారిని ఎన్నడూ లక్ష్యంగా చేసుకోరాదని ఆమె స్పష్టం చేశారు. పాలస్తీనియన్ జర్నలిస్ట్స్ సిండికేట్ కూడా దీనిని 'క్రూరమైన నేరం'గా అభివర్ణించింది.

గాజాలో 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 200 మంది మీడియా సిబ్బంది మరణించినట్లు మీడియా హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు, ఖతార్‌కు చెందిన అల్ జజీరాకు మధ్య చాలాకాలంగా ఉద్రిక్త సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తమ దేశంలో అల్ జజీరా ప్రసారాలను నిషేధించి, వారి కార్యాలయాలపై దాడులు కూడా చేసింది.




More Telugu News