Air India Express: విమాన ప్రయాణికులకు శుభవార్త.. రూ.1,279కే టికెట్.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'ఫ్రీడమ్ సేల్'

Air India Express Freedom Sale Flight Tickets Starting at Rs 1279
  • 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'ఫ్రీడమ్ సేల్'
  • దేశీయ విమాన టికెట్ ప్రారంభ ధర రూ.1,279
  • అంతర్జాతీయ ప్రయాణానికి రూ.4,279 నుంచి చార్జీలు
  • ఆగస్టు 15 వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
  • 2026 మార్చి వరకు ప్రయాణించేందుకు వెసులుబాటు
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఓ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 'ఫ్రీడమ్ సేల్' పేరుతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా దేశీయ ప్రయాణానికి టికెట్ ప్రారంభ ధరను కేవలం రూ.1,279గా నిర్ణయించింది. మొత్తం 50 లక్షల సీట్లను ఈ ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 10 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ప్రత్యేకంగా ప్రారంభమైన ఈ సేల్, ఆగస్టు 11 నుంచి అన్ని ప్రధాన బుకింగ్ ఛానెళ్లలో అందుబాటులో ఉంటుంద‌ని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న వారు 2025 ఆగస్టు 19 నుంచి 2026 మార్చి 31 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. సుదీర్ఘ ప్రయాణ కాలానికి అవకాశం కల్పించడంతో ఓనం, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకు ముందుగానే ప్లాన్ చేసుకునేందుకు ప్రయాణికులకు వీలు కలుగుతుంది.

దేశీయ రూట్లలో టికెట్ ధరలు రూ.1,279 నుంచి ప్రారంభం కాగా, అంతర్జాతీయ రూట్లలో ప్రారంభ ధర రూ.4,279గా ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ ఛార్జీల ఆప్షన్లను కూడా సంస్థ అందిస్తోంది. కేవలం క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణించే వారి కోసం 'ఎక్స్‌ప్రెస్ లైట్' పేరుతో జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ చెక్-ఇన్ బ్యాగేజీతో ప్రయాణించాలనుకునే వారికి 'ఎక్స్‌ప్రెస్ వ్యాల్యూ' ఛార్జీలు దేశీయంగా రూ.1,379, అంతర్జాతీయంగా రూ.4,479 నుంచి మొదలవుతాయి.

ఇక ప్రీమియం సేవలు కోరుకునే వారి కోసం 'ఎక్స్‌ప్రెస్ బిజ్' పేరుతో బిజినెస్ క్లాస్ సీట్లను కూడా అందిస్తోంది. ఇటీవల సంస్థ కొనుగోలు చేసిన 40కి పైగా కొత్త విమానాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 116 విమానాలతో దేశీయంగా 38, అంతర్జాతీయంగా 17 గమ్యస్థానాలకు రోజూ 500కు పైగా విమాన సర్వీసులను నడుపుతోంది.
Air India Express
Freedom Sale
Air India
Flight Tickets
Low Cost Flights
Domestic Flights
International Flights
Aviation Offers
Flight Booking
Travel Deals

More Telugu News