‘నువ్వు ఆడాల్సిందే’ అన్న ఫ్యాన్.. ‘మోకాలి నొప్పి సంగతేంటి?’ అని నవ్వించిన ధోనీ

  • మరో ఐపీఎల్ సీజన్ ఆడాలని కోరిన అభిమాని
  • వైరల్‌గా మారిన మహీ ఫన్నీ రిప్లై వీడియో
  • రిటైర్మెంట్‌పై డిసెంబర్‌లో తుది నిర్ణయమని స్పష్టీకరణ 
  • గత సీజన్‌లో కెప్టెన్‌గా జట్టును నడిపించిన మహీ
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ‘తలా’ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే విషయంపై ఆయన ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా ఓ కార్యక్రమంలో అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ ఇచ్చిన ఫ‌న్నీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతుండగా, ఒక అభిమాని గట్టిగా "సార్, మీరు కచ్చితంగా మరో సీజన్ ఆడాలి" అని అరిచాడు. దీనికి ధోనీ ఏమాత్రం తడుముకోకుండా నవ్వుతూ, "అరె, ఘుట్నే మే జో దర్ద్ హోతా హై ఉస్కా టేక్ కేర్ కౌన్ కరేగా? (మరి నా మోకాళ్ల నొప్పుల సంగతి ఎవరు చూసుకుంటారు?)" అని బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. మోకాలి గాయంతో తాను పడుతున్న ఇబ్బందిని ధోనీ ఈ విధంగా సరదాగా బయటపెట్టాడు.

ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే విషయంపై ఇదే కార్యక్రమంలో ధోనీ స్పందిస్తూ, తన నిర్ణయం చెప్పడానికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. "ఇప్పుడే ఏమీ చెప్పలేను. నిర్ణయం తీసుకోవడానికి నాకు డిసెంబర్ వరకు గడువుంది. మరో రెండు నెలలు ఆగి నా భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకుంటాను" అని పేర్కొన్నాడు. ఆటగాడిగా కొనసాగకపోయినా, తాను ఎప్పటికీ చెన్నై జట్టుతోనే ఉంటానని, పసుపు జెర్సీలోనే కనిపిస్తానని స్పష్టం చేశాడు.

గత ఐపీఎల్ 2025 సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేతి గాయంతో దూరమవడంతో ధోనీనే జట్టుకు సారథ్యం వహించాడు. సమతూకంగా లేని జట్టును తన అనుభవంతో నడిపించి, సీజన్ చివర్లో కొన్ని కీలక విజయాలు అందించాడు. మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా ధోనీ బ్యాటింగ్‌లోనూ వెనుకడుగు వేస్తూ, 8వ స్థానంలో కూడా క్రీజులోకి వచ్చాడు. అయినప్పటికీ, దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా స్టేడియాలు ఆయన కోసమే కిక్కిరిసిపోతున్నాయి. ధోనీ నాయకత్వంలో సీఎస్‌కే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. దీంతో, తమ ‘తలా’ 2026లోనూ బరిలోకి దిగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, ధోనీ మాత్రం తన నిర్ణయాన్ని డిసెంబర్‌కు వాయిదా వేసి సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాడు.


More Telugu News