Kapil Sibal: లాపతా లేడీస్ గురించి తెలుసు కానీ లాపతా వైస్ ప్రెసిడెంట్ గురించి వినలేదు: కపిల్ సిబల్

Kapil Sibal on Missing Vice President Jagdeep Dhankhar
  • మాజీ ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కనిపించడంలేదంటూ వ్యంగ్యంగా స్పందించిన కాంగ్రెస్ నేత
  • అకస్మాత్తుగా రాజీనామా చేసిన ధన్ ఖడ్.. అనారోగ్య కారణాలతోనని ప్రకటన
  • ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ బీజేపీపై ప్రతిపక్షాల విమర్శలు
  • ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఎక్కడ ఉన్నారో చెప్పాలని హోంమంత్రికి సిబల్ ప్రశ్న
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలే కారణమని ఆయన స్వయంగా ప్రకటించినా.. బీజేపీ హైకమాండ్ ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఎక్కడ, ఎలా ఉన్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించారు.

గత నెల 22న ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి సడెన్ గా రాజీనామా చేశారని, అప్పటి నుంచి నేటి వరకు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడంలేదన్నారు. దీనిపై కపిల్ సిబల్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘లాపతా లేడీస్ (మహిళల అదృశ్యం) గురించి విన్నాను కానీ లాపతా వైస్ ప్రెసిడెంట్ (ఉపరాష్ట్రపతి అదృశ్యం) గురించి ఎక్కడా వినలేదు’ అని అన్నారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేశానని ధన్ ఖడ్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందోనని కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కపిల్ సిబల్ కోరారు.

ధన్ ఖడ్ అనారోగ్యం గురించి ఇటు ప్రభుత్వం కానీ అటు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదని కపిల్ సిబల్ చెప్పారు. వ్యక్తిగతంగా ధన్ ఖడ్ తో తనకు మంచి స్నేహం ఉందని, గతంలో తామిద్దరం పలు కోర్టు కేసుల్లో వాదించామని గుర్తుచేసుకున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ప్రకటన చేస్తుందా లేక సుప్రీంకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేయమంటారా? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు.
Kapil Sibal
Jagdeep Dhankhar
Vice President
Missing Vice President
Congress
BJP
Amit Shah
Rajya Sabha
India

More Telugu News