ఒక కప్పు అరకు కాఫీని కొట్టేది ఇంకేదీ లేదు: సీఎం చంద్రబాబు

  • పాడేరులో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం
  • రూ.482 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు
  • అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలను టూరిజం క్లస్టర్లుగా అభివృద్ధి
  • ఆదివాసీలకు 54 వేల ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి హామీ
ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అరకు కాఫీ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు, దాని ద్వారా గిరిజన రైతుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే ఉన్న కాఫీ సాగుకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కొత్తగా తోటల పెంపకాన్ని ప్రోత్సహించి, గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఒక కప్పు అరకు కాఫీని కొట్టేది ఇంకేదీ లేదని అంటు సోషల్ మీడియాలోనూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "అరకు కాఫీ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్. నేను ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్‌ను పారిస్ వంటి నగరాల్లో సైతం ప్రదర్శించాం. ప్రస్తుతం పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతుండగా, దానిపై 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు మరో లక్ష ఎకరాల్లో సాగును విస్తరించి గిరిజన రైతన్నలకు మరింత చేయూతనిస్తాం" అని భరోసా ఇచ్చారు. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాలంటే గంజాయికి అడ్డా అనే చెడ్డపేరు ఉండేదని, గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాలు కలుషితమయ్యాయని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా గంజాయి మాట వినపడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఆదివాసీల సంపూర్ణ అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. గిరిజనుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా రూ.482 కోట్ల వ్యయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఐదు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. డోలీ మోతలు లేని సమాజం కోసం 122 ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేశామని, గర్భిణీలకు ప్రత్యేక పోషకాహార ప్యాకేజీలు అందిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద విశాఖ జిల్లా పరిధిలోని గిరిజనులకు 54 వేల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని, అరకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలను టూరిజం క్లస్టర్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేందుకు 1000 హోం స్టేల ఏర్పాటుకు ఆర్థికంగా అండగా నిలుస్తామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో రవాణా కష్టాలు తీరుస్తామని, ఇప్పటికే రూ.8,570 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని, 'తల్లికి వందనం' పథకం ద్వారా 4.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.642 కోట్లు జమ చేశామని గుర్తుచేశారు. రద్దయిన జీవో నంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థానిక గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అంతకుముందు, వంజంగిలో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాఫీ తోటలను పరిశీలించి, గిరిజన సంప్రదాయ నృత్యాలను తిలకించారు.


More Telugu News