ప్రఖ్యాత లార్డ్స్ పిచ్ ను అమ్మేస్తారట!

  • అమ్మకానికి చారిత్రక లార్డ్స్ మైదానం టర్ఫ్
  • అభిమానుల కోసం మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక ప్రకటన
  • పిచ్ తో పాటు పచ్చికను ముక్కలుగా చేసి విక్రయించనున్న యాజమాన్యం
  • ఒక్కో ముక్క ధర 50 యూరోలు (సుమారు రూ. 5,000)
  • మైదానం అభివృద్ధి నిధుల సేకరణ కోసమే ఈ నిర్ణయం
  • సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న పునర్నిర్మాణ పనులు
క్రికెట్‌కు మక్కాగా పేరుగాంచిన చారిత్రక లార్డ్స్ మైదానంలో ఓ భాగాన్ని సొంతం చేసుకునే అరుదైన అవకాశం ఇప్పుడు క్రికెట్ అభిమానుల ముందుకొచ్చింది. మైదానంలోని పిచ్ తో పాటు పచ్చిక (టర్ఫ్)ను ముక్కలుగా చేసి అమ్మకానికి పెడుతున్నట్లు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సంచలన ప్రకటన చేసింది. ఎన్నో చారిత్రక మ్యాచ్‌లకు వేదికైన ఈ మైదానం టర్ఫ్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు ఫ్యాన్స్‌కు ఇదొక సువర్ణావకాశం.

లార్డ్స్ మైదానం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసీసీ వెల్లడించింది. రాబోయే సెప్టెంబర్ నెల నుంచి గ్రౌండ్‌లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా, మైదానంపై ఉన్న 15 మిల్లీమీటర్ల మందం గల పాత టర్ఫ్‌ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో కొత్త సర్ఫేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా తొలగించిన పాత టర్ఫ్‌ను వృధా చేయకుండా, దానిని అభిమానులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంసీసీ నిర్ణయించింది.

ఈ అమ్మకం కోసం టర్ఫ్‌ను 1.2 మీటర్ల పొడవు, 0.6 మీటర్ల వెడల్పు ఉన్న ముక్కలుగా కత్తిరించనున్నారు. ఒక్కో ముక్క ధరను 50 యూరోలుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 5,000) నిర్ణయించారు. తొలుత ఈ టర్ఫ్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని ఎంసీసీ సభ్యులకు కల్పించి, ఆ తర్వాత సాధారణ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు అందుబాటులో ఉంచనున్నారు.

ఈ అమ్మకాల ద్వారా సమీకరించిన నిధులను మైదానం అభివృద్ధి కోసమే వినియోగించనున్నట్లు ఎంసీసీ స్పష్టం చేసింది. వచ్చిన మొత్తంలో 10 శాతాన్ని ఎంసీసీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనుండగా, మిగిలిన డబ్బును లార్డ్స్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి వాడనున్నారు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లకు, బౌలింగ్ ప్రదర్శనలకు సాక్ష్యంగా నిలిచిన లార్డ్స్ మైదానం ముక్కను దక్కించుకోవడానికి అభిమానులు భారీగా పోటీపడతారని ఎంసీసీ అంచనా వేస్తోంది.


More Telugu News