మహేశ్ బాబు బర్త్‌డే.. 'ఎస్ఎస్ఎంబీ29'పై రాజమౌళి ఆసక్తికర ప్రకటన

  • మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక ప్రకటన
  • ఈ ఏడాది నవంబర్‌లో భారీ అప్‌డేట్‌కు ప్లాన్
  • ఫొటోలతో సినిమా స్థాయిని చెప్పలేమన్న జక్కన్న
  • డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయనున్న మహేశ్ బాబు
  • కీల‌క‌ పాత్రల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేష‌న్‌లో రానున్న భారీ చిత్రం 'ఎస్ఎస్ఎంబీ29' (వ‌ర్కింగ్ టైటిల్) గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం రాజమౌళి ఒక కీలక ప్రకటన చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. సినిమా స్థాయిని తెలియజేసే ఒక ప్రత్యేకమైన అప్‌డేట్‌ను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయనున్నట్లు ఆయన ప్ర‌క‌టించారు.

ఈ విషయంపై తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా రాజమౌళి ఒక సందేశాన్ని పంచుకున్నారు. "ఈ సినిమా కథ, దాని పరిధి చాలా విస్తృతమైనవి. కేవలం ఫొటోలు లేదా ప్రెస్ కాన్ఫరెన్స్‌లతో దానికి న్యాయం చేయలేం. అందుకే మేము ఈ సినిమా సారాంశాన్ని, లోతును, మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రదర్శనను సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు" అని జ‌క్క‌న్న రాసుకొచ్చారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మహేశ్ బాబు డూప్ సాయం లేకుండా స్వయంగా స్టంట్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, రాజమౌళి తన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్‌కు బదులుగా ఈ ప్రాజెక్టుకు మరొకరిని ఎంచుకోవడం కూడా చర్చనీయాంశమైంది. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌లకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే.

యాక్షన్ అడ్వెంచర్‌గా, చారిత్రక, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒడిశాలో కొంత భాగం షూటింగ్ పూర్తయింది. మహేశ్ బాబుతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


More Telugu News