ఢిల్లీ రెస్టారెంట్‌లో దుమారం.. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన జంటకు అవమానం.. వీడియో ఇదిగో!

  • సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారని లోపలికి అనుమతించలేదని ఆరోపణ
  •  సోషల్ మీడియాలో వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
  •  విషయంపై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం.. విచారణకు ఆదేశం
  •  టేబుల్ బుకింగ్ లేదనే అనుమతించలేదన్న రెస్టారెంట్ యజమాని
  •  ఇకపై డ్రెస్ కోడ్ ఉండదని మంత్రి కపిల్ మిశ్రా స్పష్టీకరణ  
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ఓ జంటను లోపలికి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశించింది.

ఢిల్లీలోని పితాంపుర ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఇటీవల ఓ జంట వెళ్లింది. అయితే, వారు సంప్రదాయ దుస్తుల్లో ఉండటంతో రెస్టారెంట్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తమతో మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించారని, ఇతరులను అనుమతించి తమకు మాత్రం ప్రవేశం నిరాకరించారని ఆ జంట ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్ యాజమాన్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాని లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ వివాదం ఢిల్లీ ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో మంత్రి కపిల్ మిశ్రా స్పందించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారని ఆయన 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఇకపై కస్టమర్ల వస్త్రధారణపై రెస్టారెంట్లు ఎలాంటి నిబంధనలు విధించవని స్పష్టం చేశారు. భారతీయ దుస్తుల్లో వచ్చేవారిని స్వాగతిస్తామని, రాఖీ పండుగ నాడు సంప్రదాయ దుస్తుల్లో వచ్చే సోదరీమణులకు ప్రత్యేక తగ్గింపులు కూడా ఇస్తామని రెస్టారెంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.

ఇక సదరు రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఆ జంట ముందుగా టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని ఆయన వివరణ ఇచ్చారు. తమ రెస్టారెంట్‌లో ఎలాంటి డ్రెస్ కోడ్ లేదని, అందరు కస్టమర్లను సమానంగా చూస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది.


More Telugu News