ఫేస్‌బుక్ స్నేహం.. రూ.8.7 కోట్ల మోసం.. వృద్ధుడిని ఆసుప‌త్రిపాలు చేసిన ప్రేమ వల!

  • ఫేస్‌బుక్ పరిచయంతో 80 ఏళ్ల వృద్ధుడికి భారీ మోసం 
  • నలుగురు మహిళల పేరుతో రెండేళ్ల పాటు సాగిన వల
  • 734 లావాదేవీల్లో ఏకంగా రూ. 8.7 కోట్లు స్వాహా
  • కొడుకును డబ్బు అడగడంతో బయటపడ్డ అసలు నిజం
  • షాక్‌తో ఆసుపత్రి పాలైన బాధితుడు, డిమెన్షియా నిర్ధారణ
ఆన్‌లైన్‌లో అపరిచితుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో చాటిచెప్పే దారుణ ఘటన ముంబ‌యిలో వెలుగుచూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళల ప్రేమ, సానుభూతి వలలో చిక్కుకున్న 80 ఏళ్ల వృద్ధుడు ఏకంగా రూ.8.7 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు 734 ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా ఈ భారీ మోసం జరిగింది. చివరికి ఈ షాక్‌తో బాధితుడు ఆసుపత్రి పాలవ్వగా, ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
2023 ఏప్రిల్‌లో బాధితుడైన వృద్ధుడు ఫేస్‌బుక్‌లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. అయితే ఆమె యాక్సెప్ట్ చేయలేదు. కొద్దిరోజుల తర్వాత ఆమె నుంచే రిక్వెస్ట్ రావడంతో ఆయన ఇంకేమీ ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి వాట్సాప్‌లో వారి సంభాషణలు మొదలయ్యాయి. తాను భర్త నుంచి విడిపోయానని, పిల్లల ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికిన షార్వి, నెమ్మదిగా డబ్బు అడగడం ప్రారంభించింది. ఆమె మాటలు నమ్మిన వృద్ధుడు డబ్బు పంపడం మొదలుపెట్టారు.

కొద్ది రోజులకే, షార్వి స్నేహితురాలినంటూ కవిత అనే మరో మహిళ రంగంలోకి దిగింది. అసభ్యకర సందేశాలు పంపుతూ ఆమె కూడా డబ్బు డిమాండ్ చేసింది. ఆ తర్వాత, షార్వి సోదరినంటూ డైనాజ్ అనే మహిళ పరిచయమైంది. షార్వి చనిపోయిందని, ఆసుపత్రి బిల్లులు కట్టాలని కోరింది. పాత వాట్సాప్ చాట్‌లను చూపించి బెదిరించి డబ్బు గుంజిం‍ది. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. చివరగా, డైనాజ్ స్నేహితురాలినంటూ జాస్మిన్ కూడా సహాయం పేరుతో డబ్బు వసూలు చేసింది.

ఇలా 2023 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో బాధితుడు మొత్తం 734 లావాదేవీల ద్వారా రూ. 8.7 కోట్లు బదిలీ చేశారు. తన ఆస్తంతా అయిపోవడంతో కోడలి దగ్గర రూ. 2 లక్షలు అప్పు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో తన కొడుకును రూ. 5 లక్షలు అడిగారు. దాంతో ఆయనకు అనుమానం వచ్చింది. తండ్రిని నిలదీయగా అసలు విషయం బయటపడింది.

తాను మోసపోయానని గ్రహించిన వృద్ధుడు తీవ్ర షాక్‌కు గురై ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు డిమెన్షియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై గ‌త నెల‌ 22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నలుగురు మహిళల పాత్రల వెనుక ఉన్నది ఒక్కరే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News