కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారు: గువ్వల బాలరాజు

  • ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు
  • బీఆర్ఎస్ లో తనకు అనుకున్నంత గౌరవం దక్కలేదని ఆవేదన
  • ప్రభుత్వాన్ని కేసీఆర్ సరిగా ప్రశ్నించలేకపోతున్నారని విమర్శ
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు తనను రెండుసార్లు ఆశీర్వదించారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో తనకు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఇంట్లో కూర్చొనే పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారని బాలరాజు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ సరిగా ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలను బీఆర్ఎస్ నేతలు గాలికొదిలేశారని... సమస్యలపై పోరాటం చేయడం లేదని చెప్పారు. ప్రజలు, ప్రజా సమస్యలే అజెండాగా ముందుకెళ్లాలని తాను ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. 

కవిత వ్యవహారంతో బీఆర్ఎస్ నేతలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్లే రాజకీయాల్లో తనకు అవకాశాలొచ్చాయని... కేసీఆర్ చెప్పింది ఇన్నాళ్లు తు.చ. తప్పకుండా పాటించానని తెలిపారు. తనను ఏ పార్టీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదని చెప్పారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని కూడా తాను ఇంతవరకు చెప్పలేదని... త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమని చెప్పారు. తన పొలిటికల్ కెరీర్ కు ఎలాంటి ప్రమాదం లేదని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News