రాఖీ పండుగకు మహిళలకు బంపర్ ఆఫర్.. ఈ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం

  • యూపీలో ఏకంగా మూడు రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం
  • హర్యానాలో మహిళలతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలకూ ఈ ఆఫర్ వర్తింపు
  • రాజస్థాన్‌లో తొలిసారిగా రెండు రోజుల పాటు ఉచిత ప్రయాణ వెసులుబాటు
  • మధ్యప్రదేశ్‌లో ఉచిత ప్రయాణంతో పాటు నగదు బహుమతి కూడా
  • ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌లలో ఏడాది పొడవునా మహిళలకు ఈ సౌకర్యం అమలు
దేశవ్యాప్తంగా శనివారం (ఆగస్టు 9) రక్షా బంధన్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించాయి. రాఖీ పండుగ సందర్భంగా సోదరుల వద్దకు వెళ్లే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపాయి. ఈ చొరవతో పండుగ రోజుల్లో మహిళల ప్రయాణం సులభతరం కానుంది.

యూపీ, రాజస్థాన్‌లలో ప్రత్యేక ఆఫర్లు
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు ఏకంగా మూడు రోజుల పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఆగస్టు 8 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు యూపీఎస్‌ఆర్‌టీసీ బస్సులతో పాటు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే సిటీ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను కూడా నడపనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

మరోవైపు, రాజస్థాన్ ప్రభుత్వం మ‌హిళ‌ల‌కు ఈసారి రెండు రోజుల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపిస్తోంది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆదేశాల మేరకు ఆగస్టు 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఈ ఆఫర్ ఇవ్వడం ఇదే తొలిసారి.

హర్యానా, మధ్యప్రదేశ్‌లోనూ కానుకలు
హర్యానా ప్రభుత్వం కూడా రాఖీ కానుకను ప్రకటించింది. ఆగస్టు 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు మహిళలతో పాటు, 15 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు. రాష్ట్రంలోని బస్సులతో పాటు, ఢిల్లీ, చండీగఢ్‌లకు వెళ్లే బస్సుల్లోనూ ఈ సౌకర్యం వర్తిస్తుంది. 

మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 9న భోపాల్, ఇండోర్ నగరాల్లోని సిటీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం. అంతేకాకుండా "లాడ్లీ బెహనా యోజన" కింద అర్హులైన మహిళలకు రూ. 1,500 రాఖీ బోనస్‌తో పాటు, రూ. 250 పండుగ బహుమతిని కూడా ప్రభుత్వం అందిస్తోంది.

కొనసాగుతున్న సంప్రదాయం
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎప్పటిలానే ఈసారి కూడా రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. అలాగే, చండీగఢ్, మొహాలీ, పంచకుల (ట్రైసిటీ) ప్రాంతాల్లోనూ రాఖీ రోజున మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. కాగా, పంజాబ్, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఏడాది పొడవునా ఉచిత బస్సు ప్రయాణ పథకాలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. 

అయితే, ఢిల్లీలో ఈ పథకం కేవలం స్థానిక మహిళలకు డీటీసీ బస్సులకు మాత్రమే పరిమితం. ఇక‌, తెలంగాణ‌లో కూడా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యం అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. అలాగే మ‌రో తెలుగు రాష్ట్రం ఏపీ కూడా ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తేనుంది. 


More Telugu News