అది బీసీ సభ కాదు... గాంధీ కుటుంబ భజన సభ: కిషన్‌రెడ్డి

  • ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ సభ గాంధీ కుటుంబ ప్రశంసలకే పరిమితం
  • రాజకీయ ఒత్తిడితోనే ఢిల్లీలో రేవంత్ రెడ్డి సభ ఏర్పాటు
  • హామీ నిలబెట్టుకోకుండా బీజేపీపై కాంగ్రెస్ నిందలు వేస్తోంది
  • ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తాం
  • స్థానిక ఎన్నికల ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ సభపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అది బీసీల ప్రయోజనాల కోసం పెట్టిన సభలా కాకుండా, గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు, అధిష్ఠానం అనుగ్రహం పొందడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభను ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 31 నిమిషాల ప్రసంగంలో దాదాపు సగం సమయం కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రశంసించడానికే కేటాయించారు. దీన్ని బట్టే ఈ సభ అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతోంది" అని అన్నారు. బీసీల సాధికారతపై కాంగ్రెస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీసీ సమాజం గ్రహించిందని, అందుకే ఇలాంటి నాటకాలకు తెరలేపారని విమర్శించారు.

తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకోకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా బీజేపీపై నిందలు వేసి తప్పించుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మత ప్రాతిపదికన, ముఖ్యంగా ముస్లింలను కలుపుకొని ఇచ్చే బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోదని ఆయన తేల్చిచెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే, రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పగటి కలలు కంటోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సుస్థిర పాలన కొనసాగుతోందని అన్నారు. రాబోయే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం గురించి ఆలోచించడం మానేయాలని ఆయన సూచించారు.


More Telugu News