సినిమాను మించిన రివెంజ్... పోలీసులకే షాకిచ్చిన ఫ్యామిలీ మర్డర్!

  • తండ్రి హత్యకు ప్రతీకారంగా తమ్ముడిపై అన్న పగ
  • పక్కా ప్రణాళికతో హైవేపై కాల్చివేత
  • తమ్ముడి అంత్యక్రియలకు హాజరై బ్యాంకాక్‌కు పరారైన అన్న
  • సూత్రధారి కోసం లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు
  • 8 ఏళ్ల నాటి కుటుంబ కలహాలతో చోటుచేసుకున్న దారుణం
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన తండ్రి హత్యకు ప్రతీకారంగా తమ్ముడినే అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు ఓ అన్న. ఎవరికీ అనుమానం రాకుండా తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొని కన్నీళ్లు కార్చాడు. ఆ తర్వాత మూడు రోజులకే దేశం విడిచి పారిపోయాడు. మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ రివెంజ్ హత్యోదంతం పోలీసులకే షాకిచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శివపురి ప్రాంతానికి చెందిన అజయ్ తోమర్ ఇటీవల హైవేపై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అజయ్ సొంత అన్న భాను తోమరే ఈ హత్యకు సూత్రధారి అని తేలింది. 2017లో వీరి తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి హనుమాన్ సింగ్ తోమర్‌ను కొందరు కాల్చి చంపారు. అతని చిన్న‌ కుమారుడు అజ‌య్‌ తోమర్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు. 

కానీ, ఆ త‌ర్వాత ఈ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడ్డ అజ‌య్‌కు జీవిత ఖైదు ప‌డింది. అజయ్ జైలులో ఉండగా, తండ్రిని చంపించిన సోద‌రుడిపై భాను ప్రతీకారంతో ర‌గిలిపోయాడు. ఏడు సంవత్సరాలుగా, అతను ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. గత నెలలో అజయ్ పెరోల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు.

దాంతో ఇటీవల కిరాయి హంతకులతో కలిసి భాను తోమ‌ర్‌ పక్కా ప్రణాళిక రచించాడు.  తన బంధువైన మోనేశ్‌, 17 ఏళ్ల బాలిక సాయంతో అజయ్‌ను కారులో శివపురి-గ్వాలియర్ హైవేపైకి పంపాడు. ప్రణాళిక ప్రకారం, నయాగావ్ తిరాహా వద్ద ఉన్న ఓ పెట్రోల్ పంపు దగ్గర ఆ బాలిక కారు ఆపమని కోరింది. అజయ్ కారు ఆపగానే, అప్పటికే అక్కడ మాటువేసిన కిరాయి హంతకులు అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు.

ఘటన తర్వాత భాను ఏమీ తెలియనట్టు ప్రవర్తించాడు. తమ్ముడి మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కార్యక్రమాలన్నీ ముగిశాక మూడు రోజుల్లోనే రహస్యంగా బ్యాంకాక్‌కు పారిపోయాడు. అయితే, 500కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు హత్యకు వాడిన కారు భాను పేరు మీద రిజిస్టర్ అయి ఉండటంతో అసలు కుట్రను ఛేదించారు. హత్యకు సహకరించిన మోనేశ్‌, ఆ మైనర్ బాలికను అరెస్ట్ చేసి, వారి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

"కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీశాయి. సూత్రధారి అయిన భానును కచ్చితంగా పట్టుకుంటాం" అని శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం భానుపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసి, అతడి పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని విదేశాంగ శాఖను కోరినట్లు పోలీసులు వెల్లడించారు. 


More Telugu News