రష్యా అధ్యక్షుడికి షాక్.. తొలిసారి నోరువిప్పిన రహస్య కుమార్తె ఎలిజవేతా.. సంచలన ఆరోపణలు

  • లక్షలాది ప్రాణాలు తీసి, నా జీవితాన్ని నాశనం చేశారంటూ పోస్ట్
  • ప్రపంచానికి నా ముఖం చూపించడం స్వేచ్ఛనిస్తోందన్న ఎలిజవేతా
  • రష్యా అధ్యక్షుడిపై కుమార్తెగా భావిస్తున్న యువతి తిరుగుబాటు
  • ప్రస్తుతం పారిస్‌లో డీజేగా పనిచేస్తున్న ఎలిజవేతా క్రివోనోగిఖ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా ఆయన రహస్య కుమార్తెగా భావిస్తున్న యువతి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దూమారం రేపుతున్నాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొని, తన జీవితాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి ఆయనేనంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో ఏళ్లుగా మౌనంగా ఉన్న ఆమె తొలిసారిగా తన తండ్రిగా భావిస్తున్న వ్యక్తిపై తిరుగుబాటు స్వరం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాల్లోకి వెళితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు, స్వెత్లానా క్రివోనోగిఖ్‌కు జన్మించిన కుమార్తెగా ఎలిజవేతా క్రివోనోగిఖ్ (22)ను అంతర్జాతీయ మీడియా వర్గాలు ఎప్పటినుంచో పేర్కొంటున్నాయి. స్వెత్లానా ఒకప్పుడు సాధారణ క్లీనింగ్ వర్కర్‌గా పనిచేసి, పుతిన్ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా అపార సంపదకు యజమానురాలయ్యారు. పండోరా పత్రాల వంటి లీకులు ఆమె ఆస్తుల వివరాలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో లూయిజా రొజోవాగా పిలువబడే ఎలిజవేతా ఇటీవల తన ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానెల్‌లో సంచలన పోస్టులు పెట్టారు.

"లక్షలాది మంది ప్రాణాలను తీసి, నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి" అంటూ పుతిన్‌ను ఉద్దేశించి ఆమె పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "మళ్లీ నా ముఖాన్ని ప్రపంచానికి చూపించడం ఎంతో స్వేచ్ఛగా ఉంది. నేను ఎవరినో, నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారో ఇది నాకు గుర్తుచేస్తోంది" అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా పుతిన్‌ను లక్ష్యంగా చేసుకున్నవేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఎలిజవేతా పారిస్‌లో నివసిస్తూ, డీజేగా పనిచేస్తున్నారు. రష్యాలో ఉన్నత వర్గాల్లో వ్యక్తిగత విషయాలపై తీవ్ర నియంత్రణ ఉన్నప్పటికీ, ఆమె బహిరంగంగా మాట్లాడటం అత్యంత సాహసోపేతమైన చర్యగా పరిగణిస్తున్నారు. అయితే, ఎలిజవేతా తన కుమార్తె అనే ఆరోపణలపై క్రెమ్లిన్ వర్గాలు ఎప్పటిలాగే స్పందించడానికి నిరాకరించాయి.


More Telugu News