సోషల్ మీడియా వీడియో కోసం 22 కార్లతో స్టంట్స్.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం.. వీడియో ఇదిగో!

  • గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన
  • కార్లలో రూ. 80 లక్షల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌సీ కూడా
  • ఫుట్‌ రెస్ట్‌ల మీద నిలబడి రోడ్డుపై యువకుల హంగామా
  • కఠిన చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు 
గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఆదివారం సాయంత్రం కొందరు యువకులు చేసిన హంగామా కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోషల్ మీడియాలో వీడియోల కోసం దాదాపు రెండు డజన్ల కార్లు రోడ్డెక్కాయి. వీటిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌సీ కూడా ఉంది. దీని ఎక్స్ షోరూం ధర దాదాపు రూ. 80 లక్షలు. కార్లన్నీ రోడ్డును అడ్డగించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఒక మెర్సిడెస్ కన్వర్టిబుల్‌లో ఇద్దరు వ్యక్తులు పైకప్పు తెరిచి సీట్లపై నిలబడి కనిపించారు. మిగతా కార్ల నుంచి కొందరు సన్‌రూఫ్‌లలోంచి బయటికి రాగా, మరికొందరు ఫుట్‌రెస్ట్‌ల మీద నిలబడి అరుపులతో హంగామా చేశారు. ఈ వాహనాలకు చట్టవిరుద్ధంగా సైరన్‌లు, హూటర్లు అమర్చారని, వాటి శబ్దం చాలా దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు.

ఈ వీడియోను గుర్తించిన గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తమ దృష్టికి రాగానే వీడియోను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనలో పాల్గొన్న వారిని, వాహనాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. త్వరలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ తరహా స్టంట్‌లు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


More Telugu News