అత్తింటి వేధింపులు.. నవ వధువు మృతి!

  • కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఘటన 
  • శ్రీవిద్య, అరుణ్ కుమార్ లకు ఐదు నెలల క్రితం వివాహం
  • అనుమానాస్పద స్థితిలో శ్రీవిద్య మృతి
  • వరకట్న వేధింపులే కారణమన్న మృతురాలి తండ్రి నాగరాజు
  • భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో అత్తింటి వేధింపుల కారణంగా పెళ్లయిన ఐదు నెలలకే నవ వధువు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొవ్వ మండలం కొండవరం గ్రామానికి చెందిన నాగరాజు, శివనందేశ్వరమ్మల కుమార్తె శ్రీవిద్య ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న కంకిపాడు మండలం కందేరుకు చెందిన అరుణ్ కుమార్‌తో ఆమె వివాహం జరిగింది.

శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తుండగా, అరుణ్ కుమార్ ఉయ్యూరు మండలం కలవపాములలో సర్వేయర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వివాహం జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవిద్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అల్లుడే తన కుమార్తెను చంపి ఉంటాడని తండ్రి నాగరాజు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరులోని తమ ఇంటిని అమ్మేసి డబ్బులు ఇవ్వాలని తన కుమార్తెను పెళ్లయిన రోజు నుంచే వేధిస్తున్నారని, అప్పటికే కట్నంగా రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నాగరాజు ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News